
- సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడు గ్రామంలో ఘటన
దుబ్బాక, వెలుగు: కుటుంబ కలహాలతో ఓ ఆర్మీ జవాన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడు గ్రామానికి చెందిన దొడ్ల నర్సింలు గౌడ్, సులోచన దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. నర్సింలు అనారోగ్యంతో చనిపోగా, పెద్ద కొడుకు అశోక్(40)18 ఏళ్ల కింద ఆర్మీలో చేరి పశ్చిమ బెంగాల్లో డ్యూటీ చేస్తున్నాడు.
ఆస్తి పంపకాల్లో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. సెలవులకు భార్య, పిల్లలతో ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలో తెలియక బంధువుల ఇళ్లల్లో ఉంటూ తిరిగి వెళ్తున్నాడు. ఇటీవల గ్రామానికి వచ్చిన అశోక్ తన బాబాయ్ వద్ద ఉంటున్నాడు. ఆర్మీలో త్రీ స్టార్ ఉద్యోగం చేస్తున్నా, గ్రామానికి వచ్చే సరికి ఉండడానికి ఇల్లు లేక ఇబ్బంది పడేవాడు. ఇంటిలో, వ్యవసాయ భూమిలో వాటా ఇవ్వాలని పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో తల్లి సులోచనను బతిమిలాడిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆదివారం ఉదయం సెల్ఫీ వీడియోతో పాటు సూసైడ్ నోట్లో తన తల్లి సులోచన, తమ్ముళ్లు అరుణ్, ప్రవీణ్, వారికి సహకరిస్తున్న గ్రామానికి చెందిన చెలుకల నర్సారెడ్డి, ఆయన మేనమామ శ్రీనివాస్ గౌడ్(ఆర్టీసీ కండక్టర్), మేనత్త అంజలి ప్రధాన కారణమని రాసి మాత్రలు మింగాడు. మాత్రలు వేసుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్న అశోక్‌ను చికిత్స కోసం స్థానికులు సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.