ప్రేమను నిరాకరించిందని ఆర్మీ జవాన్ ఆత్మహత్య

ప్రేమను నిరాకరించిందని ఆర్మీ జవాన్ ఆత్మహత్య

చెట్టుకు ఉరివేసుకుని 20 ఏళ్ల ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని  కొత్తపల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కుంట చింటూ(20) అనే యువకుడు 2023లో ఇండియన్ ఆర్మీకి ఎంపికై.. బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకుని 4 రోజుల క్రితం సెలవులపై సొంత గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో తను ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయగా.. ఆమె నో చెప్పింది.. అంతేకాదు, యువతి బంధువులు యువకుడి ఇంటికి వచ్చి అంతు చూస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది.

గ్రామంలో తన వల్ల కుటుంబ పరువు పోయిందని ఆవేదన చెందిన యువ జవాన్.. 2024, జూన్ 24వ తేదీ సోమవారం అర్థరాత్రి పొలంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అంతకంటే ముందు.. తాను చనిపోతున్నానంటూ మేన మామకు వాట్సప్ మెసేజ్ చేసినట్టు తెలుస్తోంది. మేసేజ్ ను ఆలస్యంగా చూసిన అతని మామ, కుటుంబ సభ్యులు చింటును వెతకగా.. పొలంలో చెట్టుకు వ్రేలాడుతూ కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. 

వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సెలవులపై ఇంటికి వచ్చిన యువ జవాన్  మరో 10 రోజుల్లో రాజస్థాన్ లో డ్యూటీ జాయిన్ కావలసి ఉండగా.. ప్రేమ వ్యవహారంలో మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.