సరిహద్దు దాటిన పీవోకే పౌరుడిని అప్పగించేసిన భారత ఆర్మీ

సరిహద్దు దాటిన పీవోకే పౌరుడిని అప్పగించేసిన భారత ఆర్మీ

ఆర్మీ.. దాయాది దేశానికి  సందేశం పంపింది. పొరబాటున సరిహద్దు దాటి పాకిస్థాన్‌లో ప్రవేశించిన ఓ హైదరాబాదీ సహా ఇద్దరు భారతీయులను అరెస్టు చేసి జైలులో పెట్టినట్లు దాయాది దేశం ప్రకటించిన కొద్ది రోజులకే మన ఆర్మీ తన గొప్పతనాన్ని చాటి చెప్పింది.

వాస్తవానికి మన దేశంలో భాగం అని చెబుతున్నా.. ప్రస్తుతం పాక్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి సరిహద్దు దాటి వస్తే తిప్పి అప్పగించేసింది భారత్. ఈ ఏడాది మే 17న పీవోకే నుంచి షబీర్ అహ్మద్ అనే 32 ఏళ్ల యువకుడు నియంత్రణ రేఖ దాటి తంగ్ధార్ ప్రాంతంలో భారత్‌లో అడుగుపెట్టాడు. ఆ ప్రాంతంలోని భారత ప్రజలు అతడిని పట్టుకుని ఆర్మీకి అప్పగించారు.

అయితే అతడు పొరబాటున సరిహద్దు దాటాడని, వెనక్కి అప్పగించాలని పీవోకే అధికారులు ఇటీవల భారత్‌ని కోరారు. వారి అభ్యర్థనను పరిశీలించిన భారత ఆర్మీ.. షబీర్ అహ్మద్‌ను ఇవాళ వెనక్కి పంపింది. భారత్‌లోని తంగ్ధార్, పీవోకేలోని చిలెహనా సరిహద్దు దగ్గర పాక్ అధికారులు అతడిని వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో షబీర్‌ను తిరిగి అప్పగించినట్లు భారత ఆర్మీ ప్రకటించింది. దీనిని స్వాగతించిన పాక్.. మానవత్వంతో ఆలోచించి అతడిని వెనక్కి పంపడాన్ని అభినందించింది.

ప్రశాంత్ కోసం పాక్‌తో మాట్లాడుతున్నాం

మరి ఈ సమయంలో పాక్‌లో ఉన్న భారత పౌరులు సంతోష్, దరీలాల్ విషయంలో పాక్ ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది. అయితే వారిని ఈ నెల 14నే అదుపులోకి తీసుకున్నట్లు పాక్ చెబుతున్నప్పటికీ రెండేళ్ల క్రితమే వారిని అరెస్టు చేసిందన్న రిపోర్టులు ఉన్నట్లు మన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కూమార్ ఇవాళ తెలిపారు. పాక్ ఇప్పుడు ప్రకటన చేయడం వెనుక ఏం మతలబు దాగి ఉందోనని అనుమానం వ్యక్తం చేశారు. వారిని వెనక్కి రప్పించడానికి ప్రయత్నిస్తున్నామని, ముందుగా కాన్సులర్ యాక్సిస్ ఇవ్వాల్సిందిగా కోరామని చెప్పారు.

RELATED NEWS:

ప్రియురాలిని వెతుక్కుంటూ వెళ్లి పాక్‌లో అరెస్టయిన తెలుగు యువకుడు