పాకిస్థాన్‌కు ఆర్మీ సీక్రెట్స్ లీక్.. కూరగాయల వ్యాపారి అరెస్ట్

పాకిస్థాన్‌కు ఆర్మీ సీక్రెట్స్ లీక్.. కూరగాయల వ్యాపారి అరెస్ట్

న్యూఢిల్లీ: డబ్బు కోసం ఆర్మీ ఉద్యోగి ఒకడు అమ్మడు పోయాడు. మన ఆర్మీ స్థావరాలు, ఆయుధాలు సహా అనేక రహస్యాలను శత్రు దేశం చేతిలో పెట్టేశాడు. పాకిస్థాన్‌లో బంధువులున్న ఒక కూరగాయల వ్యాపారితో ఇచ్చిన హవాలా డబ్బుకు లొంగిపోయిన పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్ఐకి ఏజెంట్‌లా మారి జన్మభూమికి ద్రోహం చేశాడు. ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులకు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అందడంతో, దానిని కన్ఫామ్ చేసుకుని రంగంలోకి దిగి కూపీ లాగి ఇద్దరినీ అరెస్టు చేశారు. డిఫెన్స్‌కు సంబంధించిన అనేక క్లాసిఫైడ్‌ డాక్యుమెంట్లను ఐఎస్‌ఐకి చేరవేయడంతో పరంజిత్ అనే ఆర్మీ ఉద్యోగిని, హబీబుర్ రెహమాన్ అనే కురగాయల వ్యాపారిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు గురువారం ప్రకటించారు.
పోఖ్రాన్ ఆర్మీ బేస్‌ దగ్గర కూరగాయల వ్యాపారం
రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఆర్మీ బేస్ క్యాంప్‌ వద్ద హబీబుర్ రెహమాన్ (34) అనే వ్యక్తి కూరగాయల వ్యాపారం చేసేవాడు. అతడు ఆర్మీ బేస్‌లో నుంచి క్లాసిఫైడ్ డాక్యుమెంట్లు సేకరించి, పాకిస్థాన్‌ ఐఎస్‌ఐకి చేరవేసేవాడు. అందుకు ప్రతిగా హబీబుర్ రెహమాన్‌కు హవాలా ద్వారా పాకిస్థాన్‌ నుంచి డబ్బు వచ్చేది. దీనిపై ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అందింది. దీంతో మంగళవారం ఢిల్లీ నుంచి పోలీసులు పోఖ్రాన్ చేసుకున్నారు. అక్కడ మకాం వేసి, రెహమాన్ వ్యవహారం గురించి కన్ఫామ్ చేసుకున్నారు. వచ్చిన సమాచారం పక్కాగా ఉందని నిర్ధారించుకున్నాక అతడి ఇంటిపై బుధవారం సాయంత్రం రైడ్ చేశారు. ఆ సమయంలోనూ రెహమాన్ ఇంట్లో ఆర్మీకి సంబంధించిన కొన్ని సీక్రెట్ డాక్యుమెంట్లను సీజ్ చేశామని పోలీసులు చెబుతున్నారు. అతడిని అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించి విచారించగా మరింత సమాచారం బయటికొచ్చింది. ‘‘హబీబుర్ రెహమాన్‌కు పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో బంధువులు ఉన్నారు. వాళ్లు ఐఎస్ఐ స్పై రాకెట్‌లో పని చేస్తారు. రెహమాన్ అక్కడికి వెళ్లినప్పుడు ఇండియన్ ఆర్మీ సీక్రెట్స్ తమకు ఇస్తే భారీగా డబ్బు ఇస్తామని డీల్ చేసుకున్నారు. దీంతో అతడు ఈ పని చేసేందుకు ఒప్పుకున్నాడు” అని తమ ఎంక్వైరీలో అతడు చెప్పాడని పోలీసులు తెలిపారు. ఆర్మీ డాక్యుమెంట్ల కోసం పోఖ్రాన్ ఆర్మీ బేస్‌లో క్లర్క్‌గా పని చేసిన పరంజీత్ అనే ఉద్యోగితో డీల్‌ కుదుర్చుకుని, అతడికి డబ్బు ఇచ్చినట్టుగా చెప్పాడని అన్నారు. ఈ సమాచారం ఆధారంగా ప్రస్తుతం ఆగ్రా కంటోన్మెంట్‌లో పని చేస్తున్న పరంజీత్‌ను గురువారం అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ ఇద్దరినీ విచారిస్తున్నామని, ఇప్పటికే వాళ్లు చెప్పిన సమాచారాన్ని ఆర్మీతో షేర్ చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పరంజీత్‌ ద్వారా లీక్‌ అయిన డేటా అంతా చాలా సీక్రెట్ సమాచారం అని ఆర్మీ అధికారులు కూడా ధ్రువీకరించారని అన్నారు.