
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్లో చికిత్సకు డబ్బులు అడిగితే కంప్లయింట్ చేయాలని ఆరోగ్య శ్రీ అధికారులు సూచించారు. డబ్బులు వసూలు చేస్తే 24 గంటలు పనిచేసే నంబర్104కు కాల్చేయాలని తెలిపారు. శనివారం వెలుగులో ప్రచురితమైన ‘ఆరోగ్య శ్రీ ఉన్నా డబ్బులివ్వాల్సిందే’ కథనంపై ఆరోగ్య శ్రీ అధికారులు స్పందించారు. అన్ని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్లో నిఘా పెట్టామని చెప్పారు.
పేద రోగుల విషయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యవహరించే తీరుపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బులు వసూలు చేసినట్టు తేలితే పెనాల్టీ వేయడంతో పాటు..ఆరోగ్య శ్రీ ఎంప్యానల్మెంట్ను రద్దు చేస్తూ సిఫార్సు చేస్తామని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా ఆరోగ్య శ్రీ పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు తమ దృష్టికి తీసుకువస్తే ఆ మొత్తాన్ని రికవరీ చేయిస్తామని వివరించారు.