నాలుగైదు నెలలుగా ఆరోగ్యశ్రీ బిల్లులు బంద్.. పేషెంట్లను చేర్చుకోని హాస్పిటళ్లు

నాలుగైదు నెలలుగా ఆరోగ్యశ్రీ బిల్లులు బంద్.. పేషెంట్లను చేర్చుకోని హాస్పిటళ్లు

ఆరోగ్యశ్రీ బిల్లులు ఆపేసిన్రు

పెండింగ్​ బకాయిలు రూ.500 కోట్లకుపైనే

నాలుగైదు నెలలుగా నిధులు విడుదల చేయని సర్కార్

ఇబ్బందులు పడుతున్నామంటున్న నెట్​వర్క్​ హాస్పిటళ్లు

కరోనా ఎఫెక్ట్​తో చిన్న హాస్పిటళ్లకు పెరిగిన కష్టాలు

బిల్లులు రాక ఆరోగ్యశ్రీ పేషెంట్లను చేర్చుకునేందుకు వెనకడుగు

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశ్రీ బకాయిలు మళ్లీ పెరుగుతున్నాయి. నాలుగైదు నెలలుగా బిల్లులు రిలీజ్ చేయడం లేదు. పెండింగ్​ బకాయిల కోసం గతేడాది ఆగస్ట్‌‌లో నెట్‌‌వర్క్ హాస్పిటళ్లు సమ్మెకు దిగాయి. అప్పుడు నెలనెలా బిల్లులు చెల్లిస్తామని, పెండింగ్ లేకుండా చూసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. కానీ, ఆ హామీని సర్కారు నిలుపుకోవడం లేదు. సమ్మె చేసిన కొత్తలో కొంతకాలం రెగ్యులర్‌‌గా నిధులు విడుదల చేశారు.

ఇప్పుడు మళ్లీ బకాయిలు పెరిగిపోతున్నాయి. నాలుగైదు నెలలుగా బిల్లులు రిలీజ్ కావడం లేదు. ఇప్పటికే రూ.500 కోట్లకుపైగా బకాయిలు పెండిం లో ఉన్నాయని నెట్‌‌వర్క్‌‌ హాస్పిటల్స్‌‌ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. కరోనా ట్రీట్​మెంట్​ను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తామంటూ ఇలా బిల్లులు చెల్లించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చిన్న హాస్పిటళ్లకే ఎక్కువ కష్టాలు

కరోనా వైరస్‌‌తో పెద్ద పెద్ద కార్పొరేట్, ప్రైవేట్ దవాఖాన్లకు కాసులు కురుస్తుండగా, చిన్న హాస్పిటళ్లు, క్లినిక్‌‌లు ఫైనాన్షియల్​గా ఇబ్బందులు పడుతున్నాయి. పరిస్థితి సీరియస్‌‌గా ఉంటే తప్ప జనం దవాఖాన్లకు రావట్లేదు. చిన్న చిన్న సమస్యలు వస్తే ఆన్‌‌లైన్‌‌ కన్సల్టేషన్‌‌ వాడుకుంటున్నారు. దీంతో క్లినిక్‌‌లు, నర్సింగ్ హోంల ఆదాయం తగ్గింది. కొత్తగా హాస్పిటళ్లు పెట్టిన డాక్టర్లు, మెయింటెనెన్స్‌‌ కష్టాలతో ఇబ్బంది పడుతున్నారు. తమ పరిస్థితి కూడా బాగోలేదని ఆరోగ్యశ్రీ నెట్‌‌వర్క్‌‌ హాస్పిటళ్ల ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం 330కిపైగా నెట్‌‌వర్క్ ఆస్పత్రులు ఉండగా, ఇందులో సగానికి పైగా చిన్న దవాఖాన్లే. ప్రభుత్వం నుంచి నాలుగైదు నెలలుగా బిల్లులు కాకపోవడంతో ఈ దవాఖాన్ల డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు.

పెరిగిన మెయింటెనెన్స్​ ఖర్చులు

కరోనా ఎఫెక్ట్‌‌తో దవాఖాన్ల మెయింటెనెన్స్‌‌ ఖర్చులు పెరిగిపోయాయి. రోజూ హాస్పిటల్‌‌ను శానిటైజ్ చేయించడం, హాస్పిటల్ స్టాఫ్ మొత్తానికి మాస్కులు, గ్లవ్స్‌‌లు కొనాల్సి రావడం వంటివి అదనపు భారంగా మారాయి. నర్సులు, సిబ్బంది వేతనాలు పెంచాల్సి వచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ భారం ప్రజలపై కూడా పడింది. పెరిగిన ఖర్చుల భారం నుంచి తప్పించుకోవడానికి ఇప్పటికే చాలా హాస్పిటళ్లు కన్సల్టేషన్ చార్జీలు, డయాగ్నసిస్ చార్జీలు పెంచాయి. అయితే, అసలు పేషెంట్లే రాకపోవడంతో ఎంత పెంచినా వర్కవుట్ కావడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. పరిస్థితి బాగోలేకపోయినా హాస్పిటల్‌‌లో అడ్మిట్ అవడానికి పేషెంట్లు ఇష్టపడడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేస్తే, కొంతైనా భారం తగ్గుతుందని చెబుతున్నారు.

పేషెంట్లను చేర్చుకోని హాస్పిటళ్లు

బకాయిలు రిలీజ్ కాకపోవడం, పేషెంట్లు తక్కువగా వస్తుండడంతో దవాఖాన్లకు రెవెన్యూ జనరేట్ కావడం లేదు. దీంతో ఆరోగ్యశ్రీ పేషెంట్లను చేర్చుకునేందుకు మేనేజ్​మెంట్లు ఇష్టపడడం లేదు. గుండె, కిడ్నీ జబ్బులు వంటి పెద్ద ప్యాకేజీలు తప్ప, చిన్న చిన్న రోగాలు, సర్జరీలకు ఆరోగ్యశ్రీ అంటే అసలే ఒప్పుకోవడం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్‌‌లో ప్రస్తుతం కరోనా రోగులకే ప్రాధాన్యతను ఇస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్‌‌తోపాటు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ వంటి వాటిని కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. చివరకు నిమ్స్‌‌లోనూ ఆరోగ్యశ్రీ పేషెంట్లను చేర్చుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరముంది.

For More News..

రేపటి నుంచి బడులకు టీచర్లు