
హైదరాబాద్, వెలుగు: బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో మూడో రోజైన ఆదివారం కూడా ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్ సేవలు నిలిచిపోయాయి. బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం, నెట్‌వర్క్ ఆస్పత్రులు చెబుతున్న లెక్కకు పొంతన కుదరక చర్చలు ఫెయిల్ కాగా.. ఈ రెండ్రోజుల్లో అడుగు ముందుకు పడలేదు. బకాయిల వివరాలను ప్రభుత్వం పూర్తిగా అందించలేదని నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(తన్హా) ప్రతినిధులు చెబుతున్నారు. రెండ్రోజుల్లో మరోసారి చర్చలకు పిలుస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు 2 నెలల దాకా పైసలివ్వలేమని చెబుతోందని అసోసియేషన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అసలే అప్పుల్లో ఉన్నామని, తమకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకపోతే ఆదుకునేది ఎవరని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరకాదంటున్నారు. సోమవారం తన్హా జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ హరిప్రకాశ్ వెల్లడించారు. ప్రభుత్వ తీరు, ప్రస్తుత పరిస్థితిపై చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
రోగులకు ఇబ్బందులు
క్యాష్ లెస్ మెడికల్ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. అసలే వాతావరణ మార్పులతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు రోగాల బారిన పడుతున్న సమయంలో ఆస్పత్రులు సమ్మెకు దిగడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రోగుల సంఖ్య పెరగడంతో ఓపీ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.