మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం (డిసెంబర్19) తెలంగాణ కేడర్ కు చెందిన 41 మంది మావోయిస్టులు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 41 మంది కేడర్లు ఒకేసారి లొంగిపోవడం ఆ పార్టీకి తీరని లోటుగా అభివర్ణిస్తున్నారు.
డివిజనల్ కమిటీ సభ్యులు (DVCMs), PLGA కంపెనీ కమిటీ సభ్యులు లొంగుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 24 ఆయుధాలు పోలీసులకు అప్పగించారు. అందులో స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో AK-47, INSAS, SLR, LMG, BGL గన్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
దశాబ్దాలుగా అజ్ఞాతంలో పనిచేసిన కేడర్లు జన జీవన స్రవంతిలో కలిసిపోవడం మంచి పరిణామంగా పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది సీపీఐ (మావోయిస్టు) పార్టీకి భారీ ఎదురుదెబ్బగా పోలీసుల అంచనా వేస్తున్నారు.
గత కొద్దిరోజులుగా మావోయిస్టు పార్టీలో సంస్థాగత వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. క్యాడర్లలో మనోధైర్యం తగ్గిపోవడం లొంగుబాట్లకు ప్రధాన కారణం., నాయకత్వంపై నమ్మకం కోల్పోవడం వల్లే వరుస లొంగుబాట్లు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
►ALSO READ | ఈ బ్యాంకు మేనేజర్ లేకుంటే రూ.18 లక్షలు గోవిందా .. నల్గొండ జిల్లాలో సైబర్ నేరగాళ్ల నుంచి ఎలా కాపాడాడంటే..
2025 అక్టోబర్ 21న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు సభ్యులు జనజీవనస్రవంతి లో చేరాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపుకు సానుకూల స్పందనగా మావోయిస్టు పార్టీకి చెందిన PLGA బెటాలియన్, ఇతర సాయుధ దళాల్లో పనిచేస్తున్న కేడర్లు లొంగిపోయారు.
మొత్తం 41 మంది అజ్ఞాత మావోయిస్టు కేడర్లు పార్టీని విడిచిపెట్టి ప్రధాన జనజీవనంలో కలిశారు. లొంగుబాటు చేసినవారు హింసాత్మక మార్గాన్ని విడిచి, ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ చర్య రాష్ట్ర అభివృద్ధి, శాంతి భద్రతలు, ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు బలాన్ని చేకూర్చే కీలక ముందడుగుగా భావిస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
