ఇంత దారుణం ఏంటయ్యా : ఇంటి అద్దె అడిగిన ఓనర్ ను చంపేసిన మొగుడు పెళ్లాం

ఇంత దారుణం ఏంటయ్యా : ఇంటి అద్దె అడిగిన ఓనర్ ను చంపేసిన మొగుడు పెళ్లాం

అద్దె కోసం వచ్చారు.. జంట చక్కగా ఉంది.. పద్దతిగా ఉన్నారు కదా అని.. తన ఇంటిని అద్దెకు ఇచ్చింది ఓనర్. రెండు నెలలు సక్రమంగానే అద్దె కట్టారు.. ఆ తర్వాత అసలు రూపం బయటపడింది. అద్దె అడిగితే రేపు.. ఎల్లుండి అంటూ నాలుగు నెలలు పోస్ట్ పోస్.. ఇంటికి వచ్చిన అద్దె డబ్బులు గట్టిగా అడిగిన ఇంటి ఓనర్ ను చంపేశారు ఆ ఇంట్లో అద్దెకు ఉన్న మొగుడు పెళ్లాం.. ఈ ఘటన ఎక్కడో కాదు.. మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దేశం ఉలిక్కిపడిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఘజియాబాద్‌లో ఓ ఇంటి యజమాని అద్దె ఇమ్మని అడిగినందుకు అద్దెదారులు ఆమెను దారుణంగా హత్య చేశారు.అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లోని సూట్‌కేస్‌లో 48 ఏళ్ల ఇంటి యజమాని దీప్శిఖా శర్మ మృతదేహం లభించడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆ ఇంట్లో ఆద్దెకుండే అజయ్, ఆకృతిలే హత్య చేశారని నిర్దారించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఘజియాబాద్‌లోని రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని ఆరా చిమెరా సొసైటీలో ఈ సంఘటన జరిగింది. దీప్శిఖ, ఉమేష్ శర్మ సొసైటీలో రెండు ఫ్లాట్‌లను కలిగి ఉన్నారు. వాటిలో ఒకదానిలో వారు నివసించగా, మరొకటి గుప్తా దంపతులకు అద్దెకు ఇచ్చారని పోలీసులు తెలిపారు. గుప్తా దంపతులు నాలుగు నెలలుగా అద్దె చెల్లించలేదని, ఈ విషయంపై ఆగ్రహించిన దీప్శిఖ బుధవారం తన భర్త ఇంట్లో లేని సమయంలో అద్దెకిచ్చిన ఫ్లాట్‌ కి వెళ్ళింది.

రెంట్ అడిగేందుకు గుప్తా దంపతుల ఫ్లాట్ కి వెళ్లిన దీప్శిఖ ఎంతసేపటికి తిరిగిరాకపోవడంతో ఆమె కోసం వెతుకుతూ గుప్తా దంపతుల ఫ్లాట్ కి వెళ్ళింది. అక్కడ దీప్శిఖ లేకపోవడంతో సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. ఫుటేజీలో దీప్శిఖా గుప్తా దంపతుల ఫ్లాట్‌లోకి వెళ్లి బయటకు రాలేదని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె కుటుంబసభ్యులు.

కుటుంబసభ్యుల  ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తమ స్టైల్ లో గుప్తా దంపతులను విచారించగా అసలు నిజం బయటపడింది. దీప్శిఖను హత్య చేసిన నిందితులు.. ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టినట్లు తెలిపారు.దీప్శిఖ తమను అద్దె అడగడానికి వచ్చినప్పుడు గొడవ జరిగిందని, ఆమెను చంపి, ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టమని తెలిపారు నిందితులు.

దీప్శిఖను మొదట ప్రెషర్ కుక్కర్‌తో తలపై కొట్టి, ఆ తర్వాత దుపట్టాతో గొంతు కోసి చంపి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. దీప్శిఖ కుటుంబం నుంచి ఫిర్యాదు అందిన తర్వాత సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు పోలీసులు.