ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

దండేపల్లి, వెలుగు: వ్యవసాయానికి కరెంట్​సప్లై చేసే విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్లపై అదనపు లోడ్ పడి మోటార్లు కాలిపోతున్నాయని రైతులు శుక్రవారం మండలంలోని తాళ్లపేటలో రాస్తారోకో నిర్వహించారు. ఒక ట్రాన్స్​ఫార్మర్​కు 25 నుంచి 30 మోటార్లకు కనెక్షన్ ఇవ్వాల్సి ఉండగా వంద నుంచి 150 వరకు ఇవ్వడంతో లోడ్​సరిపోక కాలిపోతున్నాయని తెలిపారు.  అధికారులు వచ్చి అదనపు ట్రాన్స్​పార్మర్లు ఏర్పాటు చేసే వరకు రాస్తారోకో విరమించేది లేదని బీష్మించి కూర్చున్నారు. జన్నారం ఎస్సై సతీశ్​కుమార్ ట్రాన్స్​కో ఏఈ రాజనర్సుతో హామీ ఇప్పించడంతో ఆందోళన విరమించారు.

వరద బాధితులకు ఇండ్ల నిర్మాణ సామగ్రి అందజేత

మంచిర్యాల, వెలుగు: పట్టణంలోని ఎన్టీఆర్ నగర్​లో వరదలతో ధ్వంసమైన 65 ఇండ్ల పునర్నిర్మాణానికి కావాల్సిన రేకులు, సిమెంట్ బస్తాలు, పైపులను ఇండియా డెవలప్​మెంట్​ అండ్ రిలీఫ్ ఫండ్ స్వచ్ఛంద సంస్థ, దాతల సహకారంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు శక్రవారం అందజేశారు.  వరదలతో  దెబ్బతిన్న 100కు పైగా ఇండ్లకు తమ వంతు సాయంగా ఇంటి పైకప్పు రేకులు, పైపులు, సిమెంట్, ఇటుకలు అందిస్తామని రఘునాథ్​రావు తెలిపారు.  వంగపల్లి వెంకటేశ్వర్​రావు, పురుషోత్తం జాజు, మున్నారాజ్​ సిసోడియా, రజినీష్ జైన్   పాల్గొన్నారు.

కొనసాగుతున్న ఫ్రీడమ్ కప్ పోటీలు

నస్పూర్,  వెలుగు: స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా శ్రీరాంపూర్ ప్రగతి  స్టేడియంలో ఫ్రీడమ్ కప్ పోటీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం అండర్ 16  జిల్లా స్థాయి బాలబాలికలకు  పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భారతీ హోళికేరి, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు  పోటీలను  ప్రారంభించారు. డీఈవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ ఈసంపెల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రగతి స్టేడియంలో కలెక్టర్ భారతీ హోళికేరి కేక్ కట్  చేసి  ఫోటో జర్నలిస్ట్ లను సన్మానించారు.  

ప్రియురాలి ఇంటి ఎదుట ప్రియుడు ధర్నా

దండేపల్లి, వెలుగు: ప్రేమించి మోసం చేసిందని ఓ ప్రియురాలి ఇంటి ఎదుట శుక్రవారం ప్రియుడు, అతడి తల్లి ధర్నా చేశారు. లక్సెట్టిపేటకు చెందిన చాతరాజు ప్రవీణ్ వివరాల ప్రకారం.. నిజామాబాద్​కు చెందిన గట్టు అర్చన పట్టణంలోని ప్రభుత్వ హాస్టల్​లో కామాటిగా పనిచేస్తోంది. 2015 లో పరిచయమైన ఆమెతో సన్నిహితంగా తిరిగానని, పెళ్లి చేసుకుందామనుకున్నామని చెప్పారు.  ఈ క్రమంలో అర్చనకు రూ.5లక్షల నగదు, బంగారం ఇచ్చానని చెప్పారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి కుటుంబసభ్యులు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరినీ పీఎస్​కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించారు. 

వీరుల త్యాగాలను స్మరించుకోవాలి

ఆసిఫాబాద్, వెలుగు : వేలాది వీరుల త్యాగాలతో స్వాతంత్ర్యం వచ్చిందని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని  కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు.  వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా  జిల్లా జైలులో ఖైదీలకు,  ఆస్పత్రిలో రోగులకు అడిషనల్ కలెక్టర్ రాజేశం, ఎమ్మెల్యే ఆత్రం సక్కులతో కలిసి పండ్లు స్వీట్లు, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని సూచించారు. జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, డీఎంహెచ్​వో ప్రభాకర్ రెడ్డి, జైలు సూపరింటెండెంట్​స్వామి పాల్గొన్నారు.

వయోవృద్ధుల సంక్షేమానికి కృషి

ఆదిలాబాద్, వెలుగు : వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కేఆర్‌‌కే కాలనీ, సాయిలింగిలోని వృద్ధాశ్రమంలో స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తో కలిసి నిత్యావసర వస్తువులు, బట్టలువయోవృద్ధుల సంక్షేమానికి కృషి పండ్లు పంపిణీ చేశారు.  అంతకుముందు జిల్లా జైలును సందర్శించి ఖైదీలకు కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేడియంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ కప్ విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, డీఎంహెచ్​వో  నరేందర్​రాథోడ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, వయోవృద్ధుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవీదాస్ తదితరులు ఉన్నారు.

వీఆర్ఏ ల పేస్కేల్​ జాతర

మంచిర్యాల, వెలుగు:   సీఎం కేసీఆర్​ 2020 ఆగస్టు 9న వీఆర్ఏలకు పేస్కేల్​ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి మర్చిపోయారని, వెంటనే అమలు చేయాలని వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం పేస్కేల్​ జాతర పేరుతో భారీ ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి తరలివచ్చిన వీఆర్​ఏలు జడ్పీ బాయ్స్​ హైస్కూల్​ గ్రౌండ్​ నుంచి బోనాలు, బతుకమ్మలు, పోతరాజుల విన్యాసాలతో ర్యాలీగా కలెక్టరేట్​ చేరుకున్నారు. గేటు ఎదుట బైఠాయించి తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్​ ఏవో సురేశ్​కు మెమోరాండం అందజేశారు. వీఆర్ఏ జేఏసీ చైర్మన్  ఓంకార్​, కో చైర్మన్ గణపతి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.  

బ్యాడ్మింటన్ అసోసియేషన్​ అధ్యక్షుడిగా ఏసీపీ మహేశ్

మంచిర్యాల, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్​ను ఎన్నుకున్నామని  ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ తెలిపారు. ఇంతకాలం పనిచేసిన  అధ్యక్షుడు రాజీనామా చేయడంతో కొత్త కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు.

న్యాయం చేయాల్సిన పోలీస్ లే అన్యాయం చేసిన్రు

బాధిత తల్లిదండ్రుల ఆందోళన

బెల్లంపల్లి, వెలుగు: తమ కొడుకు పందుల రామకృష్ణ(18) యాక్సిడెంట్​లో చనిపోలేదని, హత్య చేశారని తల్లిదండ్రులు పందుల శ్రీనివాస్, లక్ష్మి ఆరోపించారు. చంపిన వారికి టీఆర్ఎస్​ లీడర్ల అండదండలు ఉన్నాయని, న్యాయం చేయాల్సిన పోలీసులు అన్యాయం చేశారన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో రామకృష్ణ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి పంచాయతీ పరిధిలోని పెద్దదుబ్బకు చెందిన  రామకృష్ణకు జూన్ 22న  గ్రామానికి చెందిన  టీఆర్ఎస్​లీడర్​ ముక్కెర రామకృష్ణ ఆయన వద్ద ట్రాక్టర్​ నడిపే డ్రైవర్ బండారి వంశీకృష్ణ ఫోన్ చేసి  ట్రాక్టర్​వద్దకు నీళ్లు తేవాలని చెప్పారన్నారు. నీళ్లు తీసుకుని వెళ్లిన తమ కొడుకును డ్రైవర్ వంశీకృష్ణ ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపారని ఆరోపించారు. తాము ఘటనా స్థలానికి  వెళ్లగా   తన కొడుకు   యాక్సిడెంట్​లో చనిపోయాడని చెప్పారన్నారు.  ఈ విషయంపై తాళ్ల గురిజాల ఎస్సై రాజశేఖర్​కు కంప్లైంట్​చేయడానికి వెళ్లగా   ఆయన ఫిర్యాదును స్వీకరించకపోగా  తెల్ల కాగితాలపై తమ సంతాకాలు తీసుకున్నారని తెలిపారు. సంతకాలు ఎందుకు అని అడిగితే  డెడ్ బాడీ కావాలా..? వద్దా..? అని బెదిరించారని వాపోయారు.  సీఐ కోట బాబురావుకు చెప్పినా ఫలితం లేదని వారు చెప్పారు. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు  స్పందించి తమకు న్యాయం చేయాలని తన కొడుకును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.  

ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: ఆదిలాబాద్​ రూరల్​ మండలంలోని ఆదివాసీ గ్రామాల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించకపోతే భారీ ఆందోళన చేస్తామని జడ్పీ మాజీ చైర్​పర్సన్, బీజేపీ స్టేట్​ లీడర్ సుహాసినిరెడ్డి  హెచ్చరించారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75  ఏండ్లు పూర్తయినా ఆదివాసీ గ్రామాల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.  వెంటనే సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా ఉట్టి కొట్టిండ్రు

నెట్​వర్క్​, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్​స్కూళ్లలో   చిన్నారులను బాలకృష్ణులు, గోపికల వేషధారణలతో ముస్తాబు చేశారు. అనంతరం కోలాటాలు, ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఆసిఫాబాద్​జిల్లా కేంద్రంలో యాదవసంఘం ఆధ్వర్యంలో  శ్రీకృష్ణుడి భారీ శోభయాత్ర నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో కలెక్టర్​రాహుల్​రాజ్​, ఎమ్మెల్యే ఆత్రం సక్కు  పాల్గొన్నారు.   మంచిర్యాల అర్చన టెక్స్​చౌరస్తాలో  వీహెచ్​పీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి  వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు, బీజేపీ రాష్ర్ట కార్యదర్శి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఘనంగా వజ్రోత్సవ వేడుకలు

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  జిల్లా కేంద్రంలోని  డైట్​కాలేజీ గ్రౌండ్​లో శుక్రవారం ఆదిలాబాద్​చారిటబుల్​ట్రస్ట్​ఆధ్వర్యంలో   స్వతంత్ర్య భారత 75వ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  జడ్పీ చైర్మన్​రాథోడ్​జనార్దన్,  అడిషనల్ కలెక్టర్లు నటరాజ్​, రిజ్వాన్ బాష హాజరయ్యారు. కేక్​ కట్​చేసి జాతీయ జెండాలను ఎగురవేశారు.  చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.  

ఒక వర్గం మెప్పు కోసం ఆర్ఎస్ఎస్ పై​ వ్యాఖ్యలు

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: బోథ్​ ఎమ్మెల్యే రాథోడ్​ బాపురావు గురువారం జరిగిన బహిరంగ సభలో ఒక వర్గం మెప్పుకోసం ఆర్ఎస్ఎస్​ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​ అన్నారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో వినాయక్​ చౌక్​లో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేశారు.  సామాజిక సేవలో  ముందుండే ఆర్ఎస్ఎస్​ కార్యకర్తలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వెంటనే ఎమ్మెల్యే  క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. బీజేపీ జిల్లా నాయకులు దినేశ్ మటోలియ, వేణు గోపాల్, సుహాసినీరెడ్డి,  జోగు రవి, మనాజీ తదితరులు పాల్గొన్నారు.