ప్రభుత్వం నుంచి హామీలు తప్ప పనులు లేవు

ప్రభుత్వం నుంచి హామీలు తప్ప పనులు లేవు

గణేశ్ నిమజ్జనం కోసం ప్రతి సంవత్సరం లాగే రాచకొండ పరిధిలో గల సరూర్ నగర్, నల్ల చెరువుకట్ట ఉప్పల్, సఫిల్ గూడ లాంటి ఇతర టాంక్ లపైనా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాచకొండ పోలీస్ అధికారులు తెలిపారు. ఇప్పటికే అవసరమైనన్ని క్రేన్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఎప్పటి లాగానే గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ టాంక్ బండ్ పై ఏర్పాట్లు చేశామని... బాలాపూర్ గణేష్ కూడా హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోనే నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పైనా సరిపోను క్రేన్లు ఏర్పాట్లు చేశామని చెప్పారు.  ట్యాంక్ బండ్ మీద 8 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గం మీద 9 క్రేన్లు, పీపుల్స్ ప్లాజాలో 3 క్రేన్లు, రెండు బేబీ పాండ్ల వద్ద 2 క్రేన్లు.. ట్యాంక్ బండ్ చుట్టూ 22 క్రేన్ లను ఏర్పాటు చేశారు.
 

అయితే కేవలం మట్టి గణేష్ విగ్రహాలు మాత్రమే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇటీవల భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని రకాల వినాయకుల నిమజ్జనానికి అనుమతినివ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించిన  కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేసేవరకు తమ నిరసన కొనసాగుతుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు తెలిపారు. గణేష్ ఉత్సవ సమితి కార్యాలయంలో ఆయన నిరసన దీక్ష చేపట్టారు.  స్టేషన్ నుంచి విడుదలైన తర్వాత వారు ఉత్సవ సమితి కార్యాలయంలో నిరసన దీక్షకు దిగారు. ప్రభుత్వం నుంచి హామీలు తప్ప పనులు లేవన్నారు.