తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు ఏర్పాట్లు

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు ఏర్పాట్లు
  • భారీగా ర్యాలీలు, జెండావిష్కరణలు, సన్మానాలు
  • సీఎం సభకు బస్సుల సిద్ధం
  • ఏర్పాట్లలో ఆఫీసర్ల నిమగ్నం 

హనుమకొండ సిటీ, వెలుగు: ఈ నెల 16 నుంచి 18వరకు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, అడిషనల్​ కలెక్టర్​ సంధ్యారాణి స్టానిక ఆర్ట్స్ కాలేజీ, హయగ్రీవాచారి గ్రౌండ్​లను పరిశీలించారు. నోడల్ ఆఫీసర్లకు సూచనలు చేశారు. 16న హయగ్రీవాచారి  గ్రౌండ్​ నుంచి  కాళోజీ సెంటర్, అదాలత్ సర్కిల్  మీదుగా ఆర్ట్స్ కాలేజీ  వరకు 15 వేల మందితో  భారీ ర్యాలీ చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరికి జాతీయ జెండాలు అందించి, వలంటీర్లను నియమించాలన్నారు. ఆర్ట్స్ కాలేజీ లో 15 వేల మందికి భోజనం సదుపాయం కల్పించాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, జిల్లా ఆఫీసర్లు, మేధావులు, విద్యార్థులు, ప్రజలంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా చుడాలన్నారు. 17న పంద్రాగస్టు మాదిరిగానే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 18న అంబేడ్కర్ భవన్ లో స్వతంత్ర సమర యోధులకు  సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేదుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వారి వెంట డీఆర్వో వాసుచంద్ర, గ్రేటర్​ అడిషనల్​ కమిషనర్ రషీద్,  ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈ సంజయ్, రవికుమార్, డీఆర్డీవో  శ్రీనివాస్ కుమార్ తదితరులున్నారు.

ప్రణాళికతో ముందుకెళ్లాలి..

జనగామ అర్బన్: సమైక్యతా వజ్రోత్సవాలను సక్సెస్ చేయడానికి ప్రణాళికతో ముందుకెళ్లాలని జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో ఆయన రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వం సూచించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పాలకుర్తిలో నిర్వహించే ఉత్సవాలకు చీఫ్ గెస్టుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొననున్నట్లు చెప్పారు.

సౌకర్యాలు కల్పించాలి..

వరంగల్‍, వెలుగు:  సమైక్యత ఉత్సవాలు నిర్వహించే క్రమంలో అవసరమైన భోజనాలు, గిరిజనులకు బస్సు సౌకర్యం కల్పించాలని వరంగల్‍ కలెక్టర్‍ డాక్టర్‍ గోపి సూచించారు. సోమవారం ఉత్సవాల ఏర్పాట్లపై ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. 17న హైదరాబాద్‍లో సీఎం కేసీఆర్‍ ఆదివాసీ, బంజారా భవన్‍లు ప్రారంభించే కార్యక్రమానికి జిల్లా నుంచి గిరిజనులను తరలించాలని చెప్పారు. డీసీపీ వెంకటలక్ష్మి, అడిషనల్‍ కలెక్టర్లు శ్రీవత్స, హరిసింగ్‍ తదితరులు పాల్గొన్నారు.

గ్రీవెన్స్ లో అప్లికేషన్లు వెల్లువ

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. బాధితులు కలెక్టరేట్లకు తరలివచ్చి, అర్జీలు సమర్పించారు. హనుమకొండలో 79, జనగామలో 41, మహబూబాబాద్ లో 95, ములుగులో 39, గ్రేటర్ వరంగల్ బల్దియాలో 66 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్లు, ఆఫీసర్లు వాటిని పరిశీలించి, సంబంధిత శాఖలకు పంపించారు. వెంటనే ఆయా అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు.