టెన్త్​ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

టెన్త్​ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ దాకా జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎగ్జామ్​ నిర్వహిస్తామని పేర్కొంది. కాంపోజిట్ కోర్సు, సైన్స్ పేపర్లకు ఎగ్జామ్​ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు 2,652 కేంద్రాల్లో ఉంటుందని వివరించింది. మొత్తం 4,94,620 మంది స్టూడెంట్స్ హాజరవుతున్నారని, వీరిలో 4,85,826 మంది రెగ్యులర్ స్టూడెంట్స్​ అని తెలిపింది. ఈసారి 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొంది. 

ఈనెల 24 నుంచి అన్ని స్కూల్స్​లో హాల్​టికెట్లు అందజేస్తారని, www.bse.telangana.gov.in వెబ్​సైట్​లో కూడా అందుబాటులో ఉంచామని వెల్లడించింది. ఇప్పటికే డీఈవోలు ఎగ్జామ్​ సెంటర్స్​లో సౌలత్​ల పరిశీలన పూర్తి చేశారని ప్రభుత్వం తెలిపింది. ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌‌‌‌ల నియామకం, సీసీ కెమెరాల ఏర్పాటు, గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్తయినట్లు వివరించింది. ప్రతీ ఎగ్జామ్ సెంటర్​లో ఓఆర్‌‌‌‌ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్​తో పాటు ఒక ఏఎన్​ఎంను అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఎగ్జామ్ సెంటర్స్​కు స్టూడెంట్స్ చేరుకునేందుకు వీలుగా టీఎస్​ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచిందని ప్రభుత్వం వెల్లడించింది.