నీట్ అర్హత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

నీట్ అర్హత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

10 పరీక్ష కేంద్రాలలో 5379 హాజరు కానున్న విద్యార్థులు 
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం 
 సిటి కో ఆర్డినేటర్ డా.టి. లలిత కుమారి

కరీంనగర్ వెలుగు: ఎంబిబిఎస్, బిడిఎస్, ఆయుష్, వైద్య విద్యలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఈ నెల 12న (ఆదివారం) నిర్వహించనున్న జాతీయ అర్హత పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సిటీ కోఆర్డినేటర్ డా.టి.లలిత కుమారి తెలిపారు. 10 పరీక్ష కేంద్రాలలో 5,379 మంది విద్యార్థులు హాజరుకానున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమితులైన అబ్జర్వర్లు తమ పర్యవేక్షణలో పర్యవేక్షిస్తారని చెప్పారు.

మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల, రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల, శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ చైతన్య డిగ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల, బైపాస్ రోడ్ లోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల, చల్మెడ ఆనంద్ రావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల, జగిత్యాల రోడ్డు లోని వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కళాశాల, వివేకానంద రెసిడెన్షియల్ పాఠశాల సిబిఎస్ సి, ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, హుజురాబాదులోని కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ నిర్వహించే ఈ పరీక్షకు విద్యార్థులు వారి అడ్మిట్ కార్డులపై నిర్దేశించబడిన సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. కోవిడ్ 19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. పరీక్ష ప్రారంభ సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని హెచ్చరించారు. విద్యార్థులు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, అడ్మిట్ కార్డు, శానిటైజర్ మాస్క్ లు, తప్పనిసరిగా తమ వెంట తెచ్చుకోవాలని.. ఎలక్ట్రిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించ బొమని స్పష్టం చేశారు.