సిటీలో నిమజ్జనానికి రెడీ..

V6 Velugu Posted on Sep 19, 2021

  •     హైదరాబాద్​ పరిధిలో  33 చెరువులు సిద్ధం
  •     9 వేల మందితో ఏర్పాట్లు    27 వేల మంది పోలీసులు,
  •     400 సీసీ కెమెరాలు 10 వేల మండపాలకు జియో ట్యాగింగ్​
  •     అరగంటకు 3, 4 విగ్రహాలు నిమజ్జనం చేసేలా ప్లాన్​
  •     రేపు పొద్దున 5 కల్లా పూర్తయ్యేలా ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో ఆదివారం జరిగే గణేశ్​నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాలకు హుస్సేన్​సాగర్​​అన్ని సౌలత్​లతో సిద్ధమైంది. ట్యాంక్​బండ్​పై దాదాపు 2,300 మంది సిబ్బంది, అధికారులు పని చేయనున్నారు. గ్రేటర్​వ్యాప్తంగా 9 వేల మంది బల్దియా సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. హుస్సేన్​సాగర్​లో నిమజ్జనానికి 40 భారీ క్రేన్లను తీసుకొచ్చారు. అరగంటకు 3, 4 విగ్రహాలు నిమజ్జనం చేసేలా ​ప్లాన్​ చేశారు. అన్ని విభాగాల సిబ్బందితో ఏర్పాటు చేసిన యాక్షన్ టీమ్స్ సిద్ధంగా ఉంటాయి. 27 వేల మంది పోలీసులు భద్రత కల్పించనున్నారు. శోభాయాత్రను 400 సీసీ కెమెరాలతో మానిటరింగ్​ చేయనున్నారు.

50 వేల విగ్రహాలు నిమజ్జనం చేసేలా..

ట్యాంక్ బండ్ లో ఒకే రోజు 50 వేల విగ్రహాలను నిమజ్జనం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ 6 జోన్ల పరిధిలో 33 ప్రధాన చెరువుల్లో నిమజ్జనం సజావుగా జరిగేలా ప్రణాళికలు రెడీ చేశారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్, సంజీవయ్య పార్క్ పరిసరాల్లో లైటింగ్, క్రేన్లు, బారికేడ్లతో పాటు 9 స్పీడ్ బోట్లు, 10 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. జీహెచ్ఎంసీ అధికారులు గణేశ్​ నిమజ్జన యాక్షన్ టీంలను నియమించారు. ఒక్కో టీంలో సూపర్ వైజర్, శానిటరీ జవాన్, ఎస్​ఎఫ్​ఏతోపాటు మొత్తం 21 మంది 3 షిప్టుల్లో పని చేయనున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 122 క్రేన్లును, మరో 200 మొబైల్ క్రేన్లను వాడనున్నారు. 

హుస్సేన్ సాగర్ చుట్టూ బారికేడింగ్

12 కిలోమీటర్లు విస్తరించి ఉన్న హుస్సేన్ సాగర్ చుట్టూ డబుల్ బారికేడింగ్ చేశారు. ఒకేసారి 50 వేల విగ్రహాలు ట్యాంక్ బండ్ కు పైకి రానుండటంతో పోలీసులు, బల్దియా, హెచ్ఎండీఏ అధికారుల కలిసి రూట్ మ్యాప్ రూపొందించారు. ప్రధాన మార్గాలు, ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లతోపాటు ఖైరతాబాద్ బడా గణేశ్​ రూట్ మ్యాప్ ను ఖరారు చేశారు. బాలాపూర్ నుంచి మొదలు కూకట్‌పల్లి, అల్వాల్, ఉప్పల్, ఎల్బీ నగర్, జూబ్లీహిల్స్, అత్తాపూర్​ నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ సాగనుంది. సాధ్యమైనంత త్వరగా ఖైరతాబాద్​ గణేశ్​ నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉందని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ వెల్లడించింది. సాగర్ లో వ్యర్థాలను తొలగించేందుకు 400 మంది సిబ్బంది పనిచేస్తారని అధికారులు వెల్లడించారు.

ట్యాంక్​బండ్​చుట్టూ ఆంక్షలు

హైదరాబాద్​ సిటీ వ్యాప్తంగా 33 చెరువుల్లో నిమజ్జనానికి బల్దియా ఏర్పాట్లు చేసింది. ట్యాంక్ బండ్, కాప్రా, సరూర్ నగర్, ప్రగతి నగర్, సఫిల్ గూడ, మీరాలం ట్యాంక్, నల్ల చెరువు, నాగోల్ లేక్, చర్లపల్లి లేక్ తో పాటు పలు ప్రాంతాల్లో నిమజ్జనం జరగనుంది. ట్యాంక్ బండ్  చుట్టూ 3 కిలోమీటర్ల పరిధి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చే జనాల కోసం ఆర్టీసీ, మెట్రో టైం పొడిగించాయి. అర్ధరాత్రి వరకు సర్వీసులు నడవనున్నాయి. హుస్సేన్ సాగర్ తోపాటు అన్ని చెరువుల వద్ద లైటింగ్, అదనపు ట్రాన్స్ ఫార్మర్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

వెహికల్​ ట్రాకింగ్​ సిస్టమ్​తో..

హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో నిమజ్జనానికి భద్రతా ఏర్పాట్లను పోలీసులు పూర్తి చేశారు. 10 వేల వినాయక మండపాలను జియో ట్యాగ్ చేశారు. వెహికల్ ట్రాకింగ్​ సిస్టమ్​ను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌ బడా గణనాథుడి తరలింపుకు ఆదివారం ఉదయం 5 గంటల నుంచే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సోమవారం ఉదయం 5 గంటల్లోపు అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శోభాయాత్రను 400 సీసీటీవీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నారు. హుస్సేన్‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌చుట్టూ 110 కెమెరాలను ఫిక్స్ చేశారు. గణేశ్​ శోభాయాత్ర, నిమజ్జ ప్రక్రియను డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి మంత్రులు మహమూద్​ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్​ పరిశీలించనున్నారు.

Tagged Arrangements, Tankbund, Ganesh immersion, Hyderabad, finalize

Latest Videos

Subscribe Now

More News