కల్తీ సారా నిందితుడి అరెస్ట్​..తమిళనాడులో 55కి పెరిగిన మరణాలు

కల్తీ సారా నిందితుడి అరెస్ట్​..తమిళనాడులో 55కి పెరిగిన మరణాలు

చెన్నై: తమిళనాడు కల్లకురిచ్చి జిల్లాలోని కల్తీ సారా సరఫరా కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. జిల్లాలోని కరుణాపురం గ్రామానికి చిన్నదురై అనే వ్యక్తి లిక్కర్ సప్లై చేసినట్లు గుర్తించిన పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, కల్తీ సారా తాగి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 55కి పెరిగిందని అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఘటన జరిగినప్పటి నుంచి ప్రతి రోజూ గ్రామంలో మరణాలు సంభవిస్తున్నాయని, మరికొంత మంది పలు హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. రిటైర్డ్‌‌ జస్టిస్‌‌ బి.గోకుల్‌‌దాస్‌‌ అధ్యక్షతన వేసిన వన్‌‌ మ్యాన్‌‌ కమిషన్‌‌ ఇప్పటికే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. మరో మూడు నెలల్లో ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి, రిపోర్ట్‌‌ అందించనున్నారు.

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేయగా, కలెక్టర్‌‌‌‌ను బదిలీ చేసింది. రాష్ట్రంలో అక్రమ మద్యంపై ఉక్కు పాదం మోపుతానని సీఎం స్టాలిన్‌‌ స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ స్టాలిన్‌‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌‌ చేస్తున్నాయి.

అన్నాడీఎంకే చీఫ్‌‌ పళనిస్వామి స్టాలిన్‌‌ను అసమర్థ సీఎం అని మండిపడ్డారు. రాష్ట్రంలో వెయ్యి మద్యం షాపులనైనా మూసివేయాలని బీజేపీ స్టేట్‌‌ చీఫ్‌‌ అన్నామలై డిమాండ్‌‌ చేశారు.