రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడ బీజేపీ నేతల అరెస్ట్

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడ బీజేపీ నేతల అరెస్ట్

హైదరాబాద్ లో నిరసనల పేరుతో శాంతి భద్రతలు దెబ్బతీసేందుకు BJP ప్రయత్నిస్తోందన్న మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ నేతల ఫిర్యాదులతో పోలీసులు రంగంలోకి దిగారు. అర్ధరాత్రి నుంచే…. హైదరాబాద్ సహా.. జిల్లాల్లో బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. హైదరాబాద్ కు వెళ్తారన్న సమాచారం ఉందంటూ… జిల్లాల్లో కమలం కార్యకర్తలను స్టేషన్లకు తరలిస్తున్నారు. అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనే ఉన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

హైదరాబాద్ బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర సెక్యూరిటీ టైట్ చేశారు. అటు తెలంగాణ భవన్, డీజీపీ ఆఫీస్ దగ్గర భారీగా బలగాలను మోహరించారు. ముట్టడికి వస్తే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు.. హైదరాబాద్ లో ఎక్కడికక్కడే నేతలను అరెస్ట్ చేస్తున్నారు. రాజేంద్రనగర్, నార్సింగి, మైలార్ దేవ్ పల్లిలో ఇండ్లలోనే నేతలను అదుపులోకి తీసుకుని.. స్టేషన్ కు తీసుకెళ్లారు. మణికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్, బీజేపీ కౌన్సిలర్లు, నేతలను రాయదుర్గం పీఎస్ కు తరలించారు.

అటు జిల్లాల్లో అర్ధరాత్రి నేతల ఇళ్లలోకి వెళ్లి మరీ బైండోవర్ చేశారు పోలీసులు. జగిత్యాల జిల్లా కోరుట్ల, ధర్మపురిలో బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. వరంగల్ నగరంలో అరెస్టులు చేస్తూనే.. నేతల ఇళ్ల ముందు పహారా కాస్తున్నారు పోలీసులు. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో నేతల అరెస్టులను తప్పుపడుతోంది బీజేపీ. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ గౌరవిస్తుందని… ప్రభుత్వం పోలీసుల సాయంతో బెదిరిస్తూ అక్రమ కేసులు పెడుతోందని అన్నారు నేతలు. కేటీఆర్ ఆరోపణలు ఖండిస్తూ.. జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగించాలని పిలుపునిచ్చింది.