SMAT 2025: నిప్పులు చెరిగే బంతులు.. 9 పరుగులకే 6 వికెట్లు: గుజరాత్ టైటాన్స్ పేసర్ ఆల్‌టైమ్ బెస్ట్ స్పెల్

SMAT 2025: నిప్పులు చెరిగే బంతులు.. 9 పరుగులకే 6 వికెట్లు: గుజరాత్ టైటాన్స్ పేసర్ ఆల్‌టైమ్ బెస్ట్ స్పెల్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆల్ టైమ్ రికార్డ్ ఒకటి చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ అర్షద్ ఖాన్ తన బౌలింగ్ తో నిప్పులు చెరిగి చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా శనివారం (డిసెంబర్ 6) చండీఘర్, మధ్య ప్రదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ అర్షద్ ఖాన్ తన నాలుగు ఓవర్ల స్పెల్ లో కేవలం 9 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీ చరిత్రలో ఇదే ఆల్ టైమ్ బెస్ట్ స్పెల్ కావడం విశేషం. హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ రవితేజ (13 పరుగులకు 6 వికెట్లు).. గుజరాత్‌కు పేసర్ అర్జాన్ నాగ్‌వాస్వాల్లా (13 పరుగులకు 6 వికెట్లు)  నెలకొల్పిన ఉమ్మడి రికార్డును అర్షద్ బ్రేక్ చేశాడు.  

ఈ మ్యాచ్ లో మొదట చండీఘర్ బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఓపెనర్ అర్జున్ ఆజాద్ ను క్లీన్ బౌల్డ్ చేసిన అర్షద్.. శివం భాంబ్రీని ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ కు పంపాడు. వీరిద్దరూ పరుగుల ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. ఇదే ఊపులో నిఖిల్ ఠాకూర్ ను కూడా ఔట్ చేసి మూడో వికెట్ తేన ఖాతాలో వేసుకున్నాడు. అర్షద్ బౌలింగ్ తో 16 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి చండీఘర్ కష్టాల్లో పడింది. చివర్లో సన్యామ్ సైని, గౌరవ్ పూరి, నిఖిల్ శర్మ వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును స్వల్ప స్కోర్ కే పరిమితం చేశాడు. చండీఘర్ కోల్పోయిన 8 వికెట్లలో 6 అర్షద్ ఖాన్ తీసుకోవడం విశేషం. 

26 ఏళ్ళ అర్షద్ ఖాన్ ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కు ముందు ఈ యువ పేసర్ ను గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకుంది. అంతకముందు ఈ మధ్యప్రదేశ్ పేసర్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే చండీఘర్ పై మధ్యప్రదేశ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చండీఘర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో మధ్యప్రదేశ్ 14 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసి విజయం సాధించింది.