V6 News

IND vs SA: ఓవర్లో 13 బంతులు వేశాడు: ఒకే ఓవర్లో అర్షదీప్ ఏడు వైడ్ బాల్స్.. డగౌట్‌లో అరిచేసిన గంభీర్

IND vs SA: ఓవర్లో 13 బంతులు వేశాడు: ఒకే ఓవర్లో అర్షదీప్ ఏడు వైడ్ బాల్స్.. డగౌట్‌లో అరిచేసిన గంభీర్

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ తడబడుతున్నాడు. గురువారం (డిసెంబర్ 11) చండీగఢ్ వేదికగా ముల్లన్‌పూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలి రెండు ఓవర్లలో 20 పరుగులు సమర్పించుకున్న ఈ టీమిండియా పేసర్.. మూడో ఓవర్ లో వైడ్ బాల్స్ తో విసిగించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకే ఓవర్లో 7 వైడ్ బాల్స్ వేసి సఫారీలకు అనవసర పరుగులు ఇచ్చాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 11 ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఇన్నింగ్స్ 11 ఓవర్ లో అర్షదీప్ కు సూర్య బంతిని ఇచ్చాడు. తొలి బంతికే డికాక్ సిక్సర్ బాదాడు. దీంతో అర్షదీప్ పై ఒత్తిడి నెలకొంది. రెండో బంతిని వేయడానికి ముందు రెండు వైడ్ బాల్స్ వేశాడు. ఆ తర్వాత మూడో బంతికి ముందు ఏకంగా నాలుగు వైడ్ బాల్స్ వేసి టీమిండియా సహనాన్ని పరీక్షించాడు. చివరి బంతికి ముందు మరో వైడ్ విసిరిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఓవరాల్ గా ఓవర్ పూర్తి చేయడానికి మొత్తం 13 బంతులు వేశాడు. ఈ ఓవర్ లో తన ఆరు బంతులకు 11 పరుగులు ఇచ్చిన అర్షదీప్.. 7 వైడ్ లతో కలిపి మొత్తం 18 పరుగులు సమర్పించుకున్నాడు. 

వరుసగా వైడ్ బాల్స్ వేయడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక డగౌట్ లో గట్టిగా ఆరిచేశాడు. ఓవరాల్ గా ఇప్పటివరకు మూడు ఓవర్లు వేసిన అర్షదీప్ సింగ్ 38 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. 12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజ్ లో క్వింటన్ డి కాక్ (71) జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. డికాక్ తో పాటు మార్కరం 29 పరుగులు చేసి రాణించాడు. భారత బౌలర్లలో రెండు వికెట్లు వరుణ్ చక్రవర్తికి దక్కాయి.