బీఆర్ఎస్‌‌కు ఆరూరి రమేశ్‌‌ రాజీనామా

బీఆర్ఎస్‌‌కు ఆరూరి రమేశ్‌‌ రాజీనామా

హైదరాబాద్/ వరంగల్​, వెలుగు: బీఆర్‍ఎస్‍  వరంగల్‍ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‍ నాలుగు రోజుల హైడ్రామాకు తెరదించుతూ శనివారం బీఆర్ఎస్​పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ ప్రెసిడెంట్‌‌ కేసీఆర్‌‌‌‌కు  పంపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. పార్టీలో అవకాశం కల్పించినందుకు కేసీఆర్‌‌‌‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‍లోని బీజేపీ ఆఫీసులో కాషాయ పార్టీలో చేరనున్నట్టు మీడియాకు సమాచారం అందించారు.  ఇదివరకే ఆరూరి బీజేపీలో చేరాల్సి ఉండగా, బీఆర్‌‌‌‌ఎస్ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారు.

కేసీఆర్ ఇంట్లో జరిగిన వరంగల్ లోక్‌‌సభ సన్నాహక సమావేశంలోనూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలని, గెలిపించుకుంటామని కేసీఆర్‌‌‌‌ కోరగా, ఆరూరి తిరస్కరించారు. మళ్లీ బీజేపీ నేతలకు టచ్​లోకి వెళ్లారు. ప్రధాని మోదీ పర్యటన కారణంగా నేతలు బిజీగా ఉండటంతో  ఆయన చేరిక ఆలస్యమైంది. ఈ క్రమంలో శనివారం బీఆర్ఎస్​కు రాజీనామా చేసిన ఆరూరి ఆదివారం బీజేపీలో చేరుతానని ప్రకటించారు. ఆ వెంటనే పెండింగ్​లో పెట్టిన వరంగల్‍ టికెట్​ను ఆరూరి రమేశ్​కు ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.