సీఎం కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్.. తీహార్ జైలుకు తరలింపు

సీఎం కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్.. తీహార్ జైలుకు తరలింపు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 15వ తేదీ వరకు రిమాండ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు. వారం రోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న ఆయనకు.. ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో తీహార్ జైలుకు తరలిస్తున్నారు అధికారులు. సీఎం హోదాలో తీహార్ జైలుకు వెళుతున్న మొదటి సీఎంగా కేజ్రీవాల్ నిలిచారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 24న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సోమవారంతో ఈడీ కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపర్చారు అధికారులు. 

లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తునకు కేజ్రీవాల్ సహకరించడం లేదని.. తప్పించుకునే సమాధానలు చెబుతున్నారంటూ కోర్టుకు తెలిపింది ఈడీ.  కేజ్రీవాల్ తన డిజిటల్ పరికరాల పాస్ వార్డ్స్ కూడా ఇవ్వలేదని.. విచారణ ఇంకా చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపింది ఈడీ.  కేజ్రీవాల్ తప్పించుకునే సమాధానాలు.. నాకు తెలీదు అన్న సమాధానాలు మాత్రమే ఇచ్చారంటూ ఈడీ కోర్టుకు రిపోర్ట్ ఇచ్చింది. ఈడీ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. సీఎం కేజ్రీవాల్ కు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.  

ఇదే సమయంలో.. తీహార్ జైలులో ప్రత్యేక ఆహారం, మందులు, పుస్తకాలు  మతపరమైన లాకెట్‌ను కలిగి ఉండటానికి అనుమతి కోరుతూ అప్లికేషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు. భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ వంటి పుస్తకాలను జ్యుడీషియల్ కస్టడీలో చదవడానికి కోర్టును అనుమతి కోరారు కేజ్రీవాల్ తరపు లాయర్లు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది కోర్టు.