రాజకీయ నేతలు..నైతిక విలువలను విస్మరిస్తున్నరు : బండారు దత్తాత్రేయ

రాజకీయ నేతలు..నైతిక విలువలను విస్మరిస్తున్నరు : బండారు దత్తాత్రేయ
  •     హర్యానా గవర్నర్‌‌బండారు దత్తాత్రేయ
  •     అబిడ్స్​లో బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి

బషీర్​బాగ్, వెలుగు :  ప్రస్తుత రాజకీయ నాయకులు నీతి నిజాయితీ, నైతిక విలువలు మరిచి.. పదవి, అధికారం కోసం ఆరాటపడుతున్నారని హర్యానా గవర్నర్‌‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 56వ వర్ధంతిని బూర్గుల రామకృష్ణ రావు ఫౌండేషన్ గురువారం నిర్వహించింది. ఈ సందర్భంగా లిబర్టీ దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ్వరరావు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ, ఎన్నికల్లో డబ్బుకు, కులానికి ప్రాధాన్యమివ్వకుండా నీతి నిజాయితీకి మారుపేరుగా మారాలని, అప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడినవారమవుతామని పేర్కొన్నారు. అదే బూర్గుల రామకృష్ణారావుకి నిజమైన నివాళి అని దత్తాత్రేయ పేర్కొన్నారు. బూర్గుల రామకృష్ణారావు అనేక ఉద్యమాలు చేసి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. బూర్గుల నీతి నిజాయితీకి మారుపేరు, బహు భాషా కోవిదుడు, విద్యావేత్త అని కొనియాడారు.

విద్యా రంగంలో సంస్కరణలు, వ్యవసాయ రంగంలో కీలక మార్పులు, కౌలు రైతు చట్టం, భూ సంస్కరణలు అనేకం తీసుకొచ్చి హైదరాబాద్ మహానగరానికి ఖ్యాతిని తెచ్చారన్నారు. కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్‌‌గా పనిచేసిన పరిపాలన దక్షుడు, అనుభవజ్ఞుడని పేర్కొన్నారు. ఆయనకు నిజమైన నివాళులు అర్పించాలంటే రాజకీయాల్లో మార్పు రావాలని ఆకాక్షించారు.