
హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో కుండపోత వాన కురుస్తోంది. రికార్డ్ స్థాయిలో కురుస్తోన్న వర్షంతో కామారెడ్డి జలమయమైంది. వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి. జీఆర్ కాలనీ జలదిగ్భందంలో మునిగిపోయింది.
కామారెడ్డి పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఎన్హెచ్ 44 పై నుంచి వరద నీరు వెళ్తుండటంతో కామారెడ్డి నుంచి హైదరాబాద్కు రాకపోకలు నిలిచిపోయాయి. రామాయంపేట్ నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్లో కూడా రవాణా సేవలు బంద్ అయ్యాయి. భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా బిక్కనూరు-తలమట్ల దగ్గర రైల్వే ట్రాక్ దెబ్బతింది. వరద నీరు ట్రాక్ పై నుంచి ప్రవహించడంతో ట్రాక్ కింద కంకర కొట్టుకుపోయింది.
దీంతో అప్రమత్తమైన రైల్వే శాఖ.. 22 రైళ్లను నిలిపివేసింది. మహరాష్ట్ర, నాంథేడ్, ఔరంగాబాద్, షిర్డి నుంచి హైదరాబాద్ వచ్చే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు కామారెడ్డి జిల్లాకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
►ALSO READ | తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
కామారెడ్డి జిల్లాలో కుండపోత వాన కురుస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి వెంటనే సహయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి విపత్కర పరిస్థితి తలెత్తిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. కామారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో మాట్లాడి.. సహయక చర్యలు చేపట్టాలని సూచించారు.