
టీమిండియా నయా వాల్, టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ కు ఆదివారం (ఆగస్టు 24) రిటైర్మెంట్ ప్రకటించాడు. 13 సంవత్సరాల పాటు భారత టెస్ట్ జట్టులో మూడో స్థానంలో కీలక ఇన్నింగ్స్ లు ఆడి ద్రవిడ్ వారసుడిగా పేరు తెచ్చుకున్నారు. బాగా ఆడుతూ టెస్టుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని మూడో స్థానంలో ద్రవిడ్ లేని లోటును తీర్చాడు. టీమిండియాలో చోటు కోల్పోయిన పుజారా ఆ తర్వాత దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించినా సెలక్టర్లు యంగ్ క్రికెటర్లపై ఆసక్తి చూపించడంతో నిరాశ తప్పలేదు.
ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో చోటు దక్కకపోవడంతో పుజారా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. దుర్బేధ్యమైన డిఫెన్స్ ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు ఈ నయా వాల్. ఎంత గొప్ప బ్యాటర్ అయినప్పటికీ కొంతమంది బౌలింగ్ లో ఆడదానికి ఇబ్బందిపడుతుంటారు. పుజారా కూడా తనను ఇబ్బందిపెట్టిన బౌలర్ల గురించి చెప్పుకొచ్చాడు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
తన కెరీర్ లో నలుగురు పేసర్లు తనకు చాలా ఛాలెంజింగ్ గా మారారని అన్నాడు. వీరిలో సౌతాఫ్రికాకు చెందిన ఫాస్ట్ బౌలర్లు డేల్ స్టెయిన్, మోర్న్ మోర్కెల్ కాగా.. ఇంగ్లాండ్ నుంచి జేమ్స్ ఆండర్సన్.. ఆస్ట్రేలియా నుంచి పాట్ కమ్మిన్స్ తన కెరీర్‌లో కఠినమైన బౌలర్లుగా చెప్పాడు. ఆశ్చర్యకరంగా ఈ లిస్ట్ లో ఒక్క స్పిన్నర్ కూడా లేకపోవడం విశేషం. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ 13 సార్లు పుజారాను ఔట్ చేసినా అతను తనకు కష్టమైన బౌలర్ అని ప్రస్తావించలేదు.
ఇండియా తరపున 103 టెస్ట్ మ్యాచ్ లాడిన పుజారా 43 యావరేజ్ తో 7195 పరుగులు చేశాడు. 19 సెంచరీలు చేసిన పుజారా.. టెస్టుల్లో స్పెషలిస్టుగా పేరుపొందాడు. ఆస్ట్రేలియాపై 2023లో డబ్ల్యూటీసి ఫైనల్ లో పుజారా తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. పుజారా కేరీర్ లో చిరస్మరణీయంగా మిగిలిన టెస్టు 2018-19 లో ఆడిన ఆస్ట్రేలియా టెస్టు. ఈ టెస్టులో మొత్తం 1258 బాల్స్ ఫేస్ చేసిన పుజారా.. 521 రన్స్ చేసి అదరగొట్టాడు.