
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఆగస్టు 28న సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ . కామారెడ్డిలోని పలు లోతట్టు ప్రాంతాలు, కాలనీలు నీటమునిగాయి. జిల్లాలోని ఆర్గొండలో అత్యధికంగా 31.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.మెదక్ లోని నాగపూర్ లో 20.88 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. కామారెడ్డి జిల్లాలోని బికనూరు లో 19.1 సెంటీమీటర్లు, పాత రాజంపేట్ లో 18.9 సెంటీమీటర్లు, దోమకొండ లో 16.5 సెంటీమీటర్లు , మెదక్ జిల్లాల్లో రామాయంపేటలో 16 సెంటీమీటర్లు, మెదక్ లోని మరో రెండు ప్రాంతాల్లో 13 సెంటీమీటర్ల అత్యధిక భారీ వర్షపాతం నమోదయ్యింది.
మరో వైపు హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యా ప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్‌కో సిబ్బందిని ఆదేశించారు.
►ALSO READ | కామారెడ్డిలో 31.93 సెంటీమీటర్ల వర్షపాతం..ఉప్పొంగిన వాగులు.. కొట్టుకుపోయిన కార్లు..
అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర పాలక, పురపాలక, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతో పాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.