DPL 2025: టీమిండియా బౌలర్ అయినా తగ్గేదే లేదు: తొలి మ్యాచ్‌లోనే సెహ్వాగ్ కొడుకు బౌండరీల మోత

DPL 2025: టీమిండియా బౌలర్ అయినా తగ్గేదే లేదు: తొలి మ్యాచ్‌లోనే సెహ్వాగ్ కొడుకు బౌండరీల మోత

భారత మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ గురించి పరిచయం అవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. చివరికి మ్యాచ్‌ ఎలాంటి స్థితిలో ఉన్నా దూకుడుగా ఆడడం అతని నైజం. టెస్టుల్లో 8 వేలకు పైగా పరుగులు సాధించిన సెహ్వాగ్..సుదీర్ఘ ఫార్మాట్ లో 100 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అతికొద్ది క్రికెటర్లలో ఒకడు. టెస్టుల్లో ట్రిఫుల్ సెంచరీ బాదిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన వీరేంద్ర సెహ్వాగ్.. రెండు సార్లు 300+ మైలురాయిని అందుకున్నాడు. దశాబ్దానికి పైగా టీమిండియాకు మెరుపు ఆరంభాలను అందిస్తూ తనదైన ముద్ర వేశాడు. 

సెహ్వాగ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు అతడి కొడుకు ఆర్యవీర్ క్రికెట్ లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో 17 ఏళ్ళ వయసులో అరంగేట్రం చేశాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తరపున ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో డెబ్యూ చేసిన ఆర్యవీర్.. 16 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు. చేసింది తక్కువ పరుగులే అయినప్పటికీ ఈ 17 ఏళ్ళ క్రికెటర్ టీమిండియా బౌలర్ నవదీప్ సైనీ బౌలింగ్ లో కొట్టిన రెండు బౌండరీలు హైలెట్ గా నిలిచాయి. ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి రెండు బంతులను ఎంతో స్టయిలిష్ గా కవర్స్ దిశగా ఆడుతూ బౌండరీలు బాదాడు. 

ALSO READ :  దులీప్ ట్రోఫీకి టీమిండియా టెస్ట్ కెప్టెన్ దూరం..

సైనీ టీమిండియా బౌలర్ గా ఆడిన అనుభవం ఉన్నపటికీ ఎలాంటి బెదురు లేకుండా ఆడి బౌండరీలుగా మలిచిన తీరు తన తండ్రి సెహ్వాగ్ దూకుడును గుర్తు చేసింది. 17 ఏళ్ళ వయసులో అగ్రెస్సివ్ గా మొదలుపెట్టిన ఆర్యవీర్.. ఫ్యూచర్ లో టీమిండియాకు ఆడతాడో లేదో చూడాలి. ఈ మ్యాచ్ విషయానికి మొదట బ్యాటింగ్ చేసిన సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. యుగల్ సైని (52), జస్వీర్ సెహ్రావత్ (37) రాణించారు. లక్ష్య ఛేదనలో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌ 93 పరుగులకే ఆలౌట్ అయింది. కింగ్స్ తరఫున మనీ గ్రెవాల్ 4-0-23-5తో అత్యుత్తమ గణాంకాలతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.