నల్గొండ దత్తతపై రచ్చ

నల్గొండ దత్తతపై  రచ్చ
  • విమర్శలకు పదును పెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి​ఎంపీ కోమటిరెడ్డి  
  •     ఒక్క రోడ్డు తప్పా పట్టణాభివృద్ధికి చేయలేదని ప్రచారం 
  •     నల్గొండలో భారీగా నిధులు దుర్వినియోగం చేశారంటున్న బీజేపీ
  •     నల్గొండను అవినీతి మయం చేశారని చెప్తున్న పిల్లి రామరాజు
  •     మళ్లీ గెలిపిస్తే పెండింగ్​ పనులు కంప్లీట్​ చేస్తానంటున్న ఎమ్మెల్యే 
  •     నేడు నల్గొండ, నకిరేకల్​లో సీఎం ఎన్నికల ప్రచార సభలు

నల్గొండ, వెలుగు:  నల్గొండ దత్తతపై ప్రధాన రాజకీయ పార్టీలు విమర్శలకు పదును పెట్టాయి. 2018 ఎన్నికల్లో కంచర్ల భూపాల్​ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నల్గొండను దత్తత తీసుకుంటానని చెప్పిన కేసీఆర్​ ఆ తర్వాత మాట మార్చారని కాంగ్రెస్​, బీజేపీ పార్టీలు ఆరోపిస్తున్నాయి.  ఎన్నికలు అవగానే జడ్పీ చైర్మన్ బండా నరేందర్​రెడ్డి ఇంట్లో రెండు రోజులు మకాం వేసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్  ఐదేళ్లలో ఒక్క రోడ్డు వేయడం తప్ప ఇంకేమీ లేదని  కాంగ్రెస్ అభ్యర్థి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం చేస్తున్నారు.  

ఇంకోవైపు నల్గొండను స్మార్ట్​ సిటీ చేసేందుకు కేంద్రం రూ.400కోట్లు ఇస్తే  అధికార పార్టీ ఎమ్మెల్యే దుర్వినియోగం చేశాడని బీజేపీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్​ గౌడ్​ఆరోపిస్తున్నారు. మరోవైపు ఫార్వర్డ్​ బ్లాక్​ అభ్యర్థి పిల్లి రామరాజు యాదవ్​ సైతం అభివృద్ధి పేరిట నల్గొండను అవినీతిమయం చేశారని దుమ్మెత్తి పోస్తున్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌ రెడ్డి మాత్రం తనను మళ్లీ గెలిపిస్తే పెండింగ్‌‌ పనులు పూర్తి చేస్తానని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా సోమవారం సీఎం కేసీఆర్​ నల్గొండ, నకిరేకల్​కు రానుండడంతో నల్గొండ దత్తత అంశం మరోసారి హాట్ టాపిక్​గా మారింది. 

ఇచ్చింది రూ.1300 కోట్లు

నల్గొండ ఓల్డ్​ సిటీని గోల్డ్​ సిటీగా మారుస్తానని, పట్టణం నలువైపులా ఔటర్​ రింగ్​రోడ్డు నిర్మిస్తానని చెప్పిన కేసీఆర్​ ఎన్నికలు జరిగిన మూడేళ్ల వరకు కన్నెత్తి కూడా చూడలేదు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్​ తండ్రి మారయ్య వర్ధంతి సభకు 2021లో నల్గొండకు వచ్చినప్పుడు  దత్తత హామీ గుర్తుకొచ్చింది. దీంతో ఆగమేఘాల మీద రంగంలోకి దిగిన అధికారులు రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, ఐటీహబ్​, నుడా, వైకుంఠదామాలు, వెజ్​నాన్​ వెజ్​ మార్కెట్లు, సెంట్రల్​ లైటింగ్స్​, జంక్షన్లు, పెద్ద రోడ్లు సుందీకరణ... వివిధ రకాల పనులన్నింటికి కలిపి రూ.1300 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారు. 

కానీ ఫండ్స్ సకాలంలో రిలీజ్ కాకపోవడంతో శాంక్షన్​ చేసిన పనులు గడువులోగా పూర్తి చేయడంలో ఫెయిలయ్యారు.  ముఖ్యంగా పట్టణంలోని అంతర్గత రోడ్లు, శివారు ప్రాంతాల్లోని వార్డుల్లో రోడ్లు బాగు చేయకుండా వదిలేశారు. పదేళ్ల కింద కాంగ్రెస్‌ హయంలో వేసిన రోడ్లు తప్పా  కొత్త రోడ్ల నిర్మాణం జరగలేదు. వార్డుల్లో ఎక్కడి సమస్యలు ఉండటంతో తీవ్ర అసంతృప్తి గురైన బీఆర్ఎస్​ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరడంతో దత్తత వ్యవహారం మరింత రచ్చకెక్కింది. 

చేసింది రూ.300 కోట్ల పనులే 

2021లో పనులకు ఆమోదం లభిస్తే ఈ మూడేళ్లలో కేవలం రూ.300 కో ట్ల పనులే జరిగాయి. అవి కూడా వందశాతం కంప్లీట్​ చేసిన పనుల్లో ఐటీ హబ్​, క్లాక్​టవర్​ నుంచి మర్రిగూడ బైపాస్​ వరకు వేసిన పెద్ద రోడ్డు మాత్రమే. కొద్దిపాటి నిధులతో నిర్మించిన వైకుంఠధామాలు, పార్క్​లు, జంక్షన్ల సుందీకరణ, బస్తీ దవాఖాన లాంటి పనులు మినహా పెద్ద ప్రాజెక్టులు ముందుకు కదల్లేదు. ముఖ్యంగా మిర్యాలగూడ రోడ్డు, క్లాక్​ టవర్​ నుంచి అవుట్ డోర్​స్టేడియం వరకు రోడ్డు నిర్మాణం, కళాభారతి, శిల్పారామం, ఉదయ సముద్రం సుందీకరణ, మెడికల్​ కాలేజీ, ఆర్అండ్‌‌బీ గె స్ట్​ హౌస్‌‌ లాంటి అనేక పనులు పెండింగ్‌‌లోనే ఉన్నాయి. నల్గొండ పట్టణా భివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నుడా కార్యచరణ కూడా ఆగిపోయింది.  

నకిరేకల్‌‌లో ఆగిపోయిన వర్క్స్​ 

ఎన్నికల నేపథ్యంలో నకిరేకల్​ నియోజకవర్గంలో మొదలు పెట్టిన పనులన్నీ ఎక్కడికక్కడే ఆపేశారు. నల్గొండ, నకిరేకల్​, మునుగోడు ప్రాంతాలకు తాగుసాగునీరు అందించే నార్కట్​పల్లి మండలంలోని బ్రహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.  15 ఏళ్ల కింద చేపట్టిన ప్రాజెక్టును పూర్తిచేసి తానే ఓపెనింగ్​చేస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్​ మాట తప్పారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. 

ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్​లో ఉన్న అయిటిపాముల ప్రాజెక్టుకు రూ.101 కోట్లతో శంకుస్థాపన చేసినా..  భూసేకరణ కూడా మొదలుపెట్టలేదు. నకిరేకల్​లో మెయిన్​రోడ్డు తవ్వి వదిలేశారు. బస్టాండ్​ రోడ్డు అధ్వానంగా మారింది. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మళ్లీ గెలిపిస్తేనే ఈ పనుల్నీ పూర్తిచేస్తామని చెబుతున్నారు.