ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు..యూపీలో 34 మంది మృతి

ఉత్తరాదిని ముంచెత్తిన వర్షాలు..యూపీలో 34 మంది మృతి

భారీ వర్షాలతో ఉత్తర భారత్ గజగజ వణుకుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ-కశ్మీర్‌ వంటి రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. యమున సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 

ఉత్తరప్రదేశ్‌లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటి వరకూ 34 మంది వరకు చనిపోయారు. గత 24 గంటల్లో 10 మంది కన్నుమూశారు. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ లెక్కల ప్రకారం.. చనిపోయిన 34 మందిలో 17మంది పిడుగుపాటుతో చనిపోగా... 12 మంది మాత్రం వరదల్లో మునిగిపోవడం వల్ల మృత్యువాత పడ్డారు. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి.  కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు మరణించారు.

వర్షాల బీభ‌త్సంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స‌మీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాల‌కు యూపీ ప్రభుత్వం అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 4 ల‌క్షల చొప్పున ప‌రిహారం ప్రక‌టించారు. ముంపు బాధితుల‌కు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, ఆశ్రయం క‌ల్పించాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలలో గాయపడిన వారికి సరైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. ఏక‌ధాటిగా కురుస్తున్న వ‌ర్షాల‌తో రాష్ట్రంలోని గంగా, రామ్ గంగా, య‌మునా, రాప్తి న‌దులు ఉధృతంగా ప్రవాహిస్తున్నాయి.

ఈ వర్షాకాలంలో ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికే 11 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దీనివల్ల నది నీటి మట్టాలు పెరిగి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. భారత మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 75 జిల్లాల్లో దాదాపు 68 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాలతో రాష్ట్రం గుండా ప్రవహించే గంగ, రామగంగ, యమునా, రప్తి నదుల్లో నీటిమట్టం పెరిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడుతున్నారు.

ఢిల్లీతోపాటు జమ్మూకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఢిల్లీతోపాటు గురుగ్రామ్‌ సహా పలు నగరాలు పట్టణాల్లో రహదారులపై నీరు నిలవడంతో జనం ట్రాఫిక్‌ కష్టాలపై వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తర రైల్వే 17 రైళ్లను రద్దు చేసింది. మరో 12 రైళ్లను దారి మళ్లించింది.