
- పోడు పట్టాల పంపిణీ.. ఇప్పట్లో లేనట్టే!
- ఫిబ్రవరి నెలాఖరులోనే ఇస్తామన్న సీఎం కేసీఆర్
- లక్ష ఎకరాలకే పట్టాలు రెడీ
- కొనసాగుతున్న పాస్బుక్కుల ప్రింటింగ్
హైదరాబాద్, వెలుగు: ‘నెలాఖరు (ఫిబ్రవరి) నాటికి పోడు పట్టాలను పంపిణీ చేస్తం. 11.50 లక్షల ఎకరాలకు పట్టాలిస్తం’.. గత నెలలో అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇది. నెల పూర్తయినా పట్టాల పంపిణీ మాత్రం ముందుకు పడలేదు. ఇంకా లేటయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ పోడు పట్టాలకు సంబంధించి సర్కారు నుంచి ఎలాంటి గైడ్లైన్స్ రిలీజ్ కాలేదు. అసలు ఎప్పటి నుంచి ఇస్తారో కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో మరో నెల టైం పట్టే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా పట్టాల పంపిణీకి అడ్డుగా మారే అవకాశం ఉంది.
ఇప్పటికీ పట్టాలే రెడీ కాలే
పోడు హక్కు పట్టాల కోసం 12.14 లక్షల ఎకరాలకు.. 4.14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తున్నది. అందులో 1.79 లక్షల మంది గిరిజనేతరులు కాగా.. 2.35 లక్షల మంది గిరిజనులున్నారు. అయితే, ఇప్పటికి కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే పట్టాలు రెడీ అయినట్టు అధికారులు చెప్తున్నారు. పాస్బుక్కుల ప్రింటింగ్ఇంకా నడుస్తున్నదని అంటున్నారు. ఇది కూడా కేవలం గిరిజనులు పోడు చేసుకుంటున్న భూములకేనని చెప్తున్నారు. ఆ లక్ష ఎకరాలకే అటవీ శాఖ నుంచి క్లియరెన్సులు వచ్చాయంటున్నారు. గిరిజనుల భూముల వరకు ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ.. గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న భూములపైనే గందరగోళం నడుస్తున్నదని, ఈ క్రమంలో పట్టాల పంపిణీ ప్రాసెస్కొలిక్కి రావాలంటే రెండు, మూడు వారాలు పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు.