ప్రభుత్వాలకు ట్యాక్సులతో భారీ ఆదాయాలు

ప్రభుత్వాలకు ట్యాక్సులతో భారీ ఆదాయాలు

న్యూఢిల్లీ: పెట్రోల్​ ధరలు పెరగడంతో జనానికి జేబుకు చిల్లు పడుతుండగా, తయారీ కంపెనీల జేబులు మాత్రం నిండుతున్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్​ మార్కెట్​లో క్రూడాయిల్ రేట్లు చుక్కల్లో ఉన్నాయి. తాజాగా క్రూడాయిల్​ పీపా ధర 96 డాలర్లకు చేరింది. 2014 తరువాత ఇంత భారీగా రేట్లు పెరగడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఈపాటికి బాదుడు మొదలయ్యేదే! కేంద్రంతోపాటు రాష్ట్రాలు కరోనాతో కష్టాలుపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పెట్రోరేట్లతోపాటు డాలర్​ మారకం విలువ పెరుగుతోంది. దీంతో పెట్రో ప్రొడక్టుల రేట్ల పెంపు అనివార్యమనే చెప్పుకోవచ్చు. ఎనలిస్టుల అంచనాల ప్రకారం వచ్చే నెల రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయి కాబట్టి ఆయిల్ మార్కెటింగ్​ కంపెనీలు (ఓంఎసీలు)​ కచ్చితంగా ధరల పెంపుపై ప్రకటన చేస్తాయి. అయితే ధరల పెరుగుదల వల్ల ఆయిల్​ తయారీ కంపెనీలు మరింత రిచ్​ అవుతుండగా, వినియోగదారులు మాత్రం చితికిపోతున్నారు.  ఇది వరకే పెట్రో ధరలు ఎక్కువగా ఉండటంతో ఇన్​ఫ్లేషన్​ అధికంగా ఉంది. మరోసారి ధరల సెగ తాకితే సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయం.   ధరల పెరుగుదల వల్ల ఆయిల్​ తయారీ కంపెనీల ఖజానాలు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ఓఎన్​జీసీ, ఇండియన్​ ఆయిల్​ వంటి కంపెనీల లాభాలు అమాంతం పెరిగాయి. అందుకే షేర్​ హోల్డర్లకు డివిడెండ్లు ప్రకటించాయి కూడా. ఇంతకీ వీటి ధరలు ఎందుకు పెరుగుతున్నాయో చూద్దాం.

యుద్ధ సమస్యలు, డిమాండ్​, ఓపెక్​​ నిర్ణయాలు..

రష్యా–ఉక్రెయిన్​ మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. తమ బలగాలను వెనక్కి పంపిస్తున్నామన్న రష్యా మాటలను ఇతర దేశాలు నమ్మడం లేదు. ప్రపంచంలో అత్యధికంగా చమురు తయారు చేసే దేశాల్లో రష్యాది రెండోస్థానం. ఇది యుద్ధం బాట పట్టింది కాబట్టి ధరలు మరింత పెరుగుతాయనే భయాలు ఉన్నాయి. మరో ఆయిల్​ దేశం యూఏఈ ఆయిల్​ పైప్​లైన్​పై హుతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. దీంతో సౌదీ అరేబియా, టర్కీకి ఆయిల్ వెళ్లే పైపులైన్లో ఇబ్బందులు తలెత్తాయి. కరోనాకు ముందుస్థాయిలో ఆయిల్​కు డిమాండ్​ పెరిగిన పరిస్థితుల్లో ఈ రెండు సమస్యలు వచ్చాయి. ఇవి చాలవన్నట్టు ఓపెక్​ దేశాలు ధరలను పెంచడానికి 2020 నుంచి ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. ఇవి ఇప్పటికిప్పుడు ప్రొడక్షన్​ను భారీగా పెంచే అవకాశాలు లేవు. అంటే డిమాండ్​కు తగినంత  క్రూడాయిల్​ అందుబాటులో లేదు. ధనిక దేశాలకు ధరల పెంపు వల్ల ఇబ్బందిలేకపోయినా.. పేద దేశాలు మాత్రం విలవిలలాడటం ఖాయం. ఆయిల్​ఖర్చు ఒకదేశ జీడీపీలో 8.8 శాతం దాటితే చాలా సమస్యలు ఉంటాయని బ్యాంక్​ ఆఫ్​ అమెరికా ఎనలిస్టు ఒకరు అన్నారు. 

జేబుపై మరింత భారం

పెట్రోల్​, డీజిల్ ధరలు పెరిగితే మిగతా అన్ని వస్తువుల ధరలూ పెరుగుతాయి. ఇన్​ఫ్లేషన్​ ఎక్కువ అవుతుంది. ప్రజల జేబుపై ఇంకింత భారం తప్పదు. రవాణాకు, ప్రయాణాలకు మరింత డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వస్తువుల, సేవల ధరలూ పెరుగుతాయి. దీంతో ప్రభుత్వాలు ఎల్పీజీ, ఎరువులపై సబ్సిడీలను తగ్గిస్తాయి. పెట్రో ప్రొడక్టులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా పన్నులు వసూలు చేస్తున్నాయి. పెట్రోల్​పై 53.5 శాతం, డీజిల్​పై 47.6 శాతం ఉన్నాయి. క్రూడాయిల్​ పీపా ధర 200 డాలర్లకు చేరినా పన్నులు తగ్గించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పెట్రో ప్రొడక్టులపై అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్న వారిలో ఇండియన్లు కూడా ఉన్నారు. వీటిపై పన్నులు, ఎక్సైజ్​డ్యూటీని వసూలు చేయడం ద్వారా కేంద్రం గత ఏడేళ్లలో రూ.24 లక్షల కోట్లు వసూలు చేశాయి. రాష్ట్రాలకు రూ.14 లక్షల కోట్లు సమకూరాయి. కొన్నిసార్లు ఇంటర్నేషనల్​ మార్కెట్లో ధరలు తగ్గినా ప్రభుత్వాలు ఎక్సైజ్​ డ్యూటీలను తగ్గించడం లేదు. అక్కడ రేట్లు పెరిగితే మాత్రం ఇక్కడ ఎక్సైజ్​ డ్యూటీలు పెరుగుతున్నాయి. అయితే ఎన్నికల కారణంగా గత మూడు నెలలుగా ఓఎంసీలు ధరలు పెంచడం లేదు. వచ్చే నెల నుంచి మాత్రం ధరల మంట తప్పకపోవచ్చు.