
న్యూఢిల్లీ: ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌లో జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను తాను చూడనని తేల్చి చెప్పారు ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌తో పూర్తిగా సంబంధాలు తెంచుకున్న భారత్.. దాయాది దేశంతో క్రికెట్ ఎలా ఆడుతుందని కేంద్రాన్ని నిలదీశారు. ఓ నేషనల్ మీడియా ఛానల్ పాడ్‌కాస్ట్‌లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత నీళ్ళు, రక్తం కలిసి ప్రవహించలేవని.. చర్చలు, ఉగ్రవాదం కలిసి సాగలేవని ప్రధాని మోడీ పలుమార్లు చెప్పారు.. కానీ పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడేందుకు ఎలా అనుమతి ఇచ్చారని బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
2025 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో ఇండియా మ్యాచ్ ఆడనుందని తెలిసి తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. తాను ఈ మ్యాచ్‌ను తాను బహిష్కరిస్తానని ఖుల్లం ఖుల్ల చెప్పేశారు. భారతదేశంలో క్రికెట్ అనేది ఒక వ్యామోహమని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌తో పూర్తిగా సంబంధాలు కట్ చేసుకున్న ఇండియా.. తిరిగి ఆ దేశంతో క్రికెట్ ఆడటంలో అర్థం లేదని బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి చాలా బాధకరమని.. మృతులు భార్యాపిల్లల ముందే కాల్చి చంపబడటం దారుణమన్నారు. పహల్గాం ఉగ్రదాడి తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు అసదుద్దీన్ ఓవైసీ.
హిందూ ఉగ్రవాదం అనేదే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు. మహాత్మా గాంధీని ఎవరు చంపారు..? ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను ఎవరు హత్య చేశారు..? ఢిల్లీ వీధుల్లో సిక్కులను ఎవరు ఊచకోత కోశారు..? ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్‌లలో పోలీసు సిబ్బందిని ఎవరు చంపుతున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. మహాత్మా గాంధీని ఎవరు చంపారో అమిత్ షా మర్చిపోయి ఉండొచ్చని సెటైర్ వేసిన ఓవైసీ.. స్వతంత్ర భారతదేశంలో మొదటి ఉగ్రవాది గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.