
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని.. త్వరలో కేసీఆర్ ను కలుస్తానని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్.. సీఎం పదవికి రాజీనామా చేసి ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ కు వెళ్లిపోయారు. డిసెంబర్ 4వ తేదీ సోమవారం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడారు.
రాజకీయాలు అన్నాక ఓసారి గెలుస్తాం..ఓసారి ఓడిపోతామని.. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించనుందని.. కేటీఆర్, హరీశ్ రావులకు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు మంచి అవకాశం వచ్చిందన్నారు. బీఆర్ఎస్.. ఓటమికి కారణాలపై విశ్లేషించుకుని లోపాలను, తప్పులను సరిచేసుకుంటుందని ఓవైసీ తెలిపారు.
తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఎం 1 సీట్లు గెలుచుకున్నా్యి. మెజార్టీ సీట్లు సాధించిన కాంగ్రెస్ తెలంగాణలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అయితే, కాంగ్రస్ లో సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే విషయంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో డిసెంబర్ 5వ తేదీ మంగళవారం కాంగ్రెస్ అధిష్టానం ఈ సస్పెన్స్ కు తెరదించనున్నట్లు తెలుస్తోంది.