కాంగ్రెస్, బీజేపీ ముట్టడి ఫైటింగ్..సవాళ్లు, ప్రతి సవాళ్లతో కరీంనగర్ సిటీలో ఉద్రిక్తత

కాంగ్రెస్, బీజేపీ ముట్టడి ఫైటింగ్..సవాళ్లు, ప్రతి సవాళ్లతో కరీంనగర్ సిటీలో ఉద్రిక్తత
  •  ఇరువర్గాలను అడ్డుకుని 
  • అరెస్టు చేసిన పోలీసులు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లో గురువారం కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీసు ఎదుట ధర్నాకు కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. వారిని అడ్డుకునేందుకు బీజేపీ శ్రేణులు ఆఫీసు వద్ద గుమిగూడారు. కోర్టు చౌరస్తా నుంచి ఎంపీ ఆఫీసు వైపు కాంగ్రెస్ నేతలు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.  ర్యాలీలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, ఇతర నేతలను బైపాస్ లోని సీటీసీకి తరలించారు.

 అక్కడ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఎలాంటి మనీ లాండరింగ్ జరుగకున్నా ఈడీ విచారణ పేరుతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని వేధింపులకు గురిచేయడం దారుణమని, ఢిల్లీ కోర్టు స్పష్టమైన తీర్పు ద్వారా బీజేపీకి చెంపదెబ్బ కొట్టినట్ట యిందని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఆఫీసు ముట్టడికి బీజేపీ శ్రేణులతో మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ప్రవీణ్ రావు ఆధ్వర్యంలో బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. 

 ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హౌస్ అరెస్టు 

చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివెళ్లేందుకు యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఎమ్మెల్యే  మేడిపల్లి సత్యం కార్యకర్తలతో కలిసి తన ఇంటి గేటు దూకేందుకు యత్నించగా పోలీసులు విఫలం చేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐని జేబు సంస్థలుగా వాడుకుంటూ, రాజకీయం గా ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఇలాంటి పాల్పడితే  బీజేపీ శ్రేణులను ప్రజా క్షేత్రంలో తిరగనివ్వమని, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.