తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇటీవల జరిగాయి. ప్రెసిడెంట్‌గా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య వి. వి. సుమలతా దేవి ఎన్నికవగా, గురువారం ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. డ్యాన్సర్స్ యూనియన్‌కు మొట్టమొదటి సారిగా మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికవ్వడం అభినందనీయమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రశంసించారు. యూనియన్‌లో ఉన్న ప్రతీ సమస్యను పరిష్కరిస్తానని సుమలతా దేవి హామీ ఇచ్చారు.
యూనియన్ సంక్షేమం కోసం పాటుపడతామని జానీ మాస్టర్ చెప్పారు. నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ ‘ఎంతోమంది జానీ మాస్టర్‌ను కిందకు లాగాలని ప్రయత్నించారు. కానీ ఆయన ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగారు. సుమలత విజయం యూనియన్‌కు మంచి రోజుల్ని తీసుకు వస్తుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం యాదవ్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్, ప్రధాన కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు. డ్యాన్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా కె. శ్రీనివాసరావు, కోశాధికారిగా పి. చిరంజీవి కుమార్, ఉపాధ్యక్షులుగా కె. సురేష్, యమ్. రాజు, సహ కార్యదర్శులుగా కే. కిరణ్ కుమార్, ఏ. రాము, కార్యనిర్వాహక కార్యదర్శిగా యు. శివ కృష్ణతో పాటు పలువురు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
