ఇంటర్ బోర్డులో విజిలెన్స్ విచారణ స్పీడప్..నాంపల్లి బోర్డు ఆఫీసులో రికార్డుల తనిఖీ

ఇంటర్ బోర్డులో విజిలెన్స్ విచారణ స్పీడప్..నాంపల్లి బోర్డు ఆఫీసులో రికార్డుల తనిఖీ
  • వివిధ పనులు, పరికరాల కొనుగోళ్ల తీరుపై ఆరా

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ బోర్డులో నిబంధనలకు విరుద్ధంగా వివిధ పనులు, కొను గోళ్లు జరిగాయన్న ఫిర్యాదులపై విజిలెన్స్ డిపార్ట్ మెంట్ విచారణ వేగవంతం చేసింది. సీసీ కెమెరా లు, ఫైర్ సేఫ్టీ సామగ్రి కొనుగోలు, బ్యాంకు ఎఫ్ డీల మార్పు తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే బోర్డులోని డీపీసీ కమిటీ సభ్యులుగా ఉన్న అధికారులను పిలిపించి గ్రిల్ చేసిన విజిలెన్స్ టీమ్.. రెండు రోజుల కింద నేరుగా నాంపల్లిలోని బోర్డు ఆఫీసుకెళ్లి మరీ రికార్డులను పరిశీలించింది. 

ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులకు 1100 పేజీల  డేటా, నివేదికను ఇంటర్ బోర్డు అధికారులు ఇచ్చినట్టు సమాచారం. తాము ఏ తప్పు చేయలేదని, అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని వివరణ ఇచ్చినట్టు తెలిసింది. బోర్డు ఎఫ్​డీలను ఎక్కువ వడ్డీ ఇచ్చే ప్రభుత్వ ఎంపానల్ బ్యాంకుల్లోకి మార్చామని, దీంతో బోర్డుకు ఏడాదికి రూ.8 కోట్లు అదనపు ఆదాయం వచ్చిందని లెక్కలు చూపించినట్టు వివరించారు. 

మరోపక్క ఇంటర్ బోర్డు ఆఫీసు రినవేషన్​నూ టీజీఈడబ్ల్యూఐడీసీ ద్వారా చేపట్టామని, సీసీ కెమెరాలు, ఇతర పరికరాలను టెండర్ల ద్వారానే కొనగోలు చేశామని పేర్కొన్నట్టు తెలిసింది.