
- ట్రంప్‌కు మోదీ మద్దతుతో ఒరిగిందేంటి?
- విదేశాంగ విధానంపై మజ్లిస్ చీఫ్ ఒవైసీ తీవ్ర విమర్శలు
హైదరాబాద్, వెలుగు: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాపై ఫీజు పెంపు నిర్ణయంతో భారతీయులు, ప్రధానంగా తెలంగాణ, ఏపీకి చెందినవారు తీవ్రంగా నష్టపోతున్నారని మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఇది భారత విదేశాంగ విధాన వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించారు.
సోమవారం హైదరాబాద్‌లో అసదుద్దీన్ మీడియాతో మాట్లాడారు. “హెచ్-1బీ వీసాలలో 71 శాతం భారతీయులకే మంజూరవుతాయి. అందులోనూ అధిక శాతం ఏపీ, తెలంగాణ నుంచి టెక్ నిపుణులే ఉన్నారు. ఈ నిర్ణయం యువతకు ఉద్యోగ అవకాశాలను తగ్గించడమే కాకుండా, భారత్ ప్రతి సంవత్సరం పొందే 125 బిలియన్ డాలర్ల రెమిటెన్సులపై కూడా ప్రభావం చూపుతుంది” అని అన్నారు.
125 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌లలో భారత ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లలో 37 శాతం వాటా తెలంగాణ, ఏపీ కలిగి ఉన్నాయని ఒవైసీ వివరించారు. ‘‘ట్రంప్ తాజా నిర్ణయం తెలుగు రాష్ట్రాల ఆర్థిక పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’’ అని ఆయన అన్నారు. “నా ఆందోళన ట్రంప్‌పై కంటే మన ప్రధాని మోదీపై ఎక్కువ. అమెరికాలో జరిగిన భారీ ‘హౌడీ మోదీ’, ‘నమస్తే ట్రంప్’ వంటి కార్యక్రమాలతో ఏం సాధించారు? మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఎన్‌ఆర్‌ఐలను సమీకరించడం, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం విదేశాంగ విజయాలు కావు’’ అని ఎద్దేవా చేశారు.
‘‘ఇది రాజకీయ లబ్ధికి సంబంధించిన అంశం కాదు. ప్రభుత్వం తన విదేశాంగ, జాతీయ భద్రతా విధానాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. వీటి ఎఫెక్ట్‌తో బాధపడేది మోదీ కాదు, సామాన్య భారతీయులు’’ అని ఒవైసీ అన్నారు. 2014-–2024ను భారత్‌కు నష్టదాయకమైన దశాబ్దంగా అభివర్ణించిన ఆయన, రాజకీయాల కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆరోపించారు.