మూడోసారీ కేసీఆరే సీఎం.. బీఆర్‌‌‌‌ఎస్‌‌ గెలిస్తే మన చేతుల్లోనే పవర్‌‌‌‌: అసదుద్దీన్‌‌

మూడోసారీ కేసీఆరే సీఎం.. బీఆర్‌‌‌‌ఎస్‌‌ గెలిస్తే మన చేతుల్లోనే పవర్‌‌‌‌: అసదుద్దీన్‌‌

జహీరాబాద్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు లేని చోట బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి కేసీఆర్‌‌‌‌కు మద్దతు ఇవ్వాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌‌లో ఎంఐఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. 

ప్రాంతీయ పార్టీలు ఉన్నచోటే అభివృద్ధి సాధ్యమవుతుందని, జాతీయ పార్టీలతో డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ జరగదన్నారు. మామకు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని, సమస్యలను పరిష్కరించే విషయంలో తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీ పడుతున్నాయని, నాలుగో పార్టీగా ఎంఐఎం చక్రం తిప్పనుందన్నారు. పవర్ ప్లే మన చేతిలోనే ఉంటుందని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు బీసీ సీఎం చేస్తామని చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతవరకు బీసీ లెక్కలు తీయని బీజేపీ ప్రజలను మభ్యపెడుతుందని మండిపడ్డారు. 

బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌ అన్నదమ్ములు.. 

బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ముల్లాగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్‌‌‌‌కు తల్లి లాంటిదని అసదుద్దీన్‌‌‌‌ ఆరోపించారు. ఈ రెండు పార్టీలు దేశ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. 70 ఏండ్ల కాంగ్రెస్ చరిత్రలో మైనార్టీలకు చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ హయాంలోనే మైనార్టీలకు ఎంతో లబ్ధి చేకూరిందని చెప్పారు. ప్రధాని మోదీ జీ20 దేశాలకు అధ్యక్షుడిగా ఉన్నందున.. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దమనకాండను ఆపాలని  కోరారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల  గురించి ప్రస్తావిస్తూ ఆయన కంట తడి పెట్టారు. సభలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.