దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోవడం గౌరవంగా ఉంది

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోవడం  గౌరవంగా ఉంది

ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా పరేఖ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.   న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ చేతుల మీదుగా ఆమె  ఈ  అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆశా పరేఖ్ మాట్లాడుతూ...  దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోవడం  గొప్ప గౌరవంగా ఉందని తెలిపారు. తన 80వ పుట్టినరోజుకు ఒక్కరోజు ముందు ఈ అవార్డు  రావడం  సంతోషంగా ఉందని తెలిపారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆమె చేసిన విశేష సేవలకు గాను  ఆశా పరేఖ్ కు ఈ అవార్డును ప్రధానం చేశారు. 1992లో  భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 

చైల్డ్ ఆర్టిస్ట్‌గా త‌న కెరీర్‌ను మొదలుపెట్టిన  ఆశా ప‌రేఖ్ ఆ తరువాత హీరోయిన్‌గా మారింది. 1960 - 70 దశకాల్లో ఓ వెలుగు వెలిగింది. ‘జబ్‌ ప్యార్‌ కిసీసే హోతా హై’, ‘ఫిర్‌ వహీ దిల్‌ లాయాహూ’, ‘లవ్‌ ఇన్‌ టోక్యో’, ‘దో బదన్‌’, ‘ఆయే దిన్‌ బహార్‌ కే’, ‘ఆయా సావన్‌ ఝూమ్‌కే’, ‘కటీ పతంగ్‌’ లాంటి సినిమాలు ఆమెను స్టార్  చేశాయి. అందం, అభినయంతో ఎంతో మంది మనసులు గెలుచుకున్న ఆశా ప‌రేఖ్ ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా అవివాహితగానే మిగిలిపోయారు. 

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం. ఇప్పటివరకు 52 మంది ఈ అవార్డును అందుకున్నారు. దేవికా రాణి మొదటి విజేత కాగా, రజనీకాంత్‌కు గతేడాది ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును  ప్రధానం చేశారు.