మాకు ఎలాంటి ఎగ్జామ్ పెట్టొద్దు

మాకు ఎలాంటి ఎగ్జామ్ పెట్టొద్దు
  •     కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా

నస్పూర్, వెలుగు: తమకు ఎగ్జామ్స్ పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆశా వర్కర్స్ యూనియన్ లీడర్లు డిమాండ్ చేశారు. మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట గురువారం వారు ధర్నా చేపట్టారు. అనంతరం జిల్లా డీఎంహెచ్ఓకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతంలో 33 ఏండ్లుగా, మైదాన ప్రాంతంలో 19 ఏండ్లుగా సేవలు అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన అనేక ట్రైనింగ్​లు పొందామని, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర అన్నిరకాల జబ్బులను గుర్తిస్తున్నామని తెలిపారు. తగిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ కీలకంగా పనిచేస్తున్నామన్నారు. 

ఇంత సీనియారిటీ ఉన్న వర్కర్లకు మళ్లీ కొత్తగా ఎగ్జామ్స్ నిర్వహించడం సమంజసం కాదన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని ముందుకు తెచ్చి అమలు చేయాలని చూసిందన్నారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆశాలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశా జిల్లా కమిటీ సభ్యులు  సమ్మక్క, శోభ, రాణి, పుష్ప, భాగ్య ,  గంగు భాయ్, కవిత, స్రవంతి,  పద్మ, నీరజ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.