
మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి (ఎల్లమ్మ) ఆలయంలో ఆషాఢ బోనాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. గత నెల 26న ప్రారంభమైన ఉత్సవాలు వరుసగా ప్రతి ఆది, గురువారాల్లో జరిగిన 9 పూజలతో ముగిశాయి. ఉత్సవాల్లో సుమారు 40 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
9వ పూజ సందర్భంగా గురువారం ఐదు అంతరాల బోనం, సమారోహణ కుంభహారతి, పోతురాజుల విన్యాసాలు జరిగాయి. 26 కుల వృత్తుల వారు పట్నాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటిసారిగా పద్మశాలి చేనేత కళాకారులు ఆలయంలో పట్టు వస్త్రాలు తయారు చేసి అమ్మవారికి సమర్పించారు.