భూగర్భ జలాల పెరుగుదలకు చర్యలు చేపట్టాలి : ఆశిష్ సంగ్వాన్     

భూగర్భ జలాల పెరుగుదలకు చర్యలు చేపట్టాలి : ఆశిష్ సంగ్వాన్     

నిర్మల్,వెలుగు: భూగర్భజలాల పెరుగుదలకు చేపట్టాల్సిన అంశాలపై సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ లో  ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడారు. జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదలకు సంబంధించి గుర్తించిన మండలాల్లో అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధిక నీటిని వినియోగించే భైంసా, నిర్మల్ పట్టణం, గ్రామీణం, ముథోల్ తదితర మండలాల్లో నీటి నిల్వలు పెంచేందుకు అమృత్ సరోవర్ కార్యక్రమం కింద చెక్ డ్యామ్ ల నిర్మాణానికి శాస్త్రీయ పద్ధతుల్లో స్థలాలు ఎంపిక చేయాలని సూచించారు. చెక్ డ్యామ్ ల ద్వారా వర్షపు నీటిని ఒడిసిపడితే భూగర్భ జలాలను రక్షించవచ్చన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, భూగర్భ జల శాఖ డీడీ పి.శ్రీనివాస బాబు, నీటిపారుదల శాఖ ఎస్ ఈ సుశీల కుమార్, డీఆర్డీఓ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.

ఇంటిపన్ను వసూలు వందశాతం పూర్తి చేయాలి

మున్సిపాలిటీలలో100శాతం ఇంటి పన్ను వసూలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్​ఆదేశించారు. కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, ఇంటిపన్నును వందశాతం వసూలు చేయాలని సూచించారు. పన్ను చెల్లించని యజమానులకు ప్రభుత్వ ఆదేశాలమేరకు నోటీసులు జారీ చేసి సీజ్ చేయాలని ఆదేశించారు.

వేసవి నేపథ్యంలో పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. పట్టణాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని సూచించారు. ఈ సమావేశంలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ కమిషనర్లు సీవీఎన్ రాజు, వెంకటేశ్వర్ రావు, మనోహర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.