రూ. 2లకే ఆవుపేడ .. స్టూడెంట్స్కు ఫ్రీ ల్యాప్టాప్ : అశోక్ గెహ్లాట్

రూ. 2లకే  ఆవుపేడ ..  స్టూడెంట్స్కు ఫ్రీ ల్యాప్టాప్ : అశోక్ గెహ్లాట్

రాజస్థాన్ లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు  అన్ని పార్టీలు విశ్వప్రయాత్నాలు చేస్తున్నాయి.  ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కొన్ని వరాలకు తోడుగా తాజాగా  మరో 5 హామీలను ప్రకటించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..  ప్రభుత్వ  కాలేజీల్లో చేరే  విద్యార్థులకు తొలి ఏడాది ట్యాబ్ లేదా ల్యాప్ టాప్ అందిస్తామని  సీఎం  అశోక్ గెహ్లాట్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. గోధన్ పథకం కింద కిలో  ఆవుపేడ రూ.2 చొప్పున కొనుగోలు చేస్తామన్నారు.    

ఇక భవిష్యత్తులో ఏ ప్రభుత్వమూ మార్చేందుకు అవకాశం లేకుండా పాత పింఛను విధానాన్ని అమలు చేస్తామని సీఎం  అశోక్ గెహ్లాట్ హామీ ఇచ్చారు.  రాష్ట్రంలో ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు ఏర్పాటు చేస్తామని, ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోతే రూ.15 లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు.  రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు కాంప్లిమెంటరీ ఇంటర్నెట్ కనెక్షన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను అందజేస్తామని గెహ్లాట్ చెప్పారు.

రాష్ట్రంలోని 1.05 కోట్ల కుటుంబాలకు రూ.500కు వంటగ్యాస్‌ సరఫరా చేస్తామన్నారు సీఎం అశోక్ గెహ్లాట్ , ప్రతి ఇంట్లో కుటుంబపెద్దగా ఉన్న మహిళకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని  తెలిపారు.  ఈ హామీలు ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలని, పార్టీ మ్యానిఫెస్టోలో కూడా ఇవి ఉంటాయని చెప్పారు.  ఎన్నికల హామీలను అమలు చేయడంలో రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ట్రాక్ రికార్డ్ ఉందని అశోక్ గెహ్లోత్ పేర్కొన్నారు.