బీజేపీ క్రమశిక్షణ లేని పార్టీ.. సీఎం ఎంపికలో ఇంత ఆలస్యం దేనికి..?: అశోక్‌ గెహ్లాట్‌

బీజేపీ క్రమశిక్షణ లేని పార్టీ.. సీఎం ఎంపికలో ఇంత ఆలస్యం దేనికి..?: అశోక్‌ గెహ్లాట్‌

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడు రోజులైనా ఇంకా ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం లేదంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ విమర్శలు చేశారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో గెలిచిన బీజేపీ వారం రోజులైనా ఒక్క రాష్ట్రంలో కూడా సీఎం పేరును ఎందుకు ఖరారు చేయకపోయిందని ప్రశ్నించారు.

భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ లేదని గెహ్లాట్‌ ఆరోపించారు. సీఎం ఎంపికలో తామే గనుక అంత ఆలస్యం చేసి ఉంటే వాళ్లు ఎన్ని విమర్శలు చేసేవారో, ఎన్ని అబద్ధాలను ప్రచారం చేసేవారో చెప్పలేమన్నారు. బీజేపీ నేతలు ప్రజలకు మాయ మాటలు చెప్పి గెలిచారని, అయినా కొత్త ప్రభుత్వానికి తాము సహకరిస్తామని చెప్పారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి గల కారణాలపై చర్చించేందుకు ఆ పార్టీ హైకమాండ్‌ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు గెహ్లాట్‌ ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో ఈ కామెంట్స్ చేశారు. 

మూడు రాష్ట్రాల్లో మత ఘర్షణలను రెచ్చగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చిందని అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. రాజస్థాన్‌ ఎన్నికల్లో.. త్రిపుల్‌ తలాక్‌, ఆర్టికల్‌ 370 రద్దు, కన్హయ్యలాల్‌ హత్య, ముస్లింలకు 50 లక్షలు, హిందువులకు 5 లక్షలు ఇచ్చారంటూ అసత్య ప్రచారం లాంటి అంశాలను బీజేపీ వాడుకుందని, ప్రజలకు అబద్ధాలు చెప్పి లబ్ధి పొందిందని ఆరోపించారు.