సోనియా గాంధీని కలవనున్న అశోక్ గెహ్లాట్

సోనియా గాంధీని కలవనున్న అశోక్ గెహ్లాట్

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వేళ రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధ్యక్ష పదవి చేపట్టినా సీఎం పీఠాన్ని వదలొద్దని గెహ్లాట్ ఆశించడం ఈ సంక్షోభానికి కారణమైంది. అనుకున్నట్లుగా ఆయన అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తారా లేదా అనేది ఈ సమావేశంతో తేలే అవకాశం ఉంది. 

ఒకవేళ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపడితే తదుపరి సీఎంగా సచిన్ పైలట్ను వ్యతిరేకిస్తూ ఆదివారం రాత్రి 80 మందికిపైగా ఎమ్మెల్యేలు స్పీకర్ సీపీ జోషీకి రాజీనామా లేఖలు అందజేయడం ఆ పార్టీలో కలకలం రేపింది. సీఎంగా గెహ్లాట్ సూచించిన వ్యక్తినే ఎంపిక చేయాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధిక్కార స్వరం వినిపించిన గెహ్లాట్ వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రెండు దశాబ్దాల తర్వాత గాంధీయేతర వ్యక్తి అధ్యక్ష పీఠం ఎక్కనున్నారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక  జరగనుండగా..సెప్టెంబర్ 30 నామినేషన్లకు చివరి తేదీ.