ఆర్టీసీ విలీన ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి..:ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వద్ధామ రెడ్డి

ఆర్టీసీ విలీన ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి..:ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వద్ధామ రెడ్డి

టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వద్ధామరెడ్డి తెలిపారు. ఆగస్టు 1న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా విలీనానికి కమిటీ వేయాలని సూచించారు. సమ్మె సమయంలో 34 మంది మరణించినట్లు వారి కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయం వారికి అంకితమని అన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా విలీన ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.  

2017,21 వేతన సవరణ కూడా చేయాలని కోరారు. నెలలోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలన్నారు. కమిటీలపై కార్మికులకు ఉన్న సందేహాలు నివృతి చేయాలన్నారు.  కార్మికుల సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 

విలీనంపై అనుమానాలున్నాయ్..

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ హన్మంతు ముదిరాజ్ తెలిపారు. ఎలాంటి నిబంధనలు లేకుండా ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా పరిగణించాలని కోరారు. 

విలీనంపై వారిలో అనుమానాలున్నాయని వాటిని నివృతి చేయాలని డిమాండ్ చేశారు.  త్వరగా విధివిధానాలు ప్రకటించి విలీన ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. సీసీఎస్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు.