టీఆర్ఎస్ను ఓడిస్తేనే సమస్యలు పరిష్కారమైతయ్ : అశ్వత్థామరెడ్డి 

టీఆర్ఎస్ను ఓడిస్తేనే సమస్యలు పరిష్కారమైతయ్ : అశ్వత్థామరెడ్డి 

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో ఆర్టీసీ కార్మికుల ఓట్లతో గెలవడం కోసం మంత్రులు కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నారని ఆర్టీసీ టీఎంయూ గౌరవ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ను మునుగోడులో ఓడిస్తేనే  ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టీఎంయూ ప్రెసిడెంట్ తిరుపతి, జనరల్ సెక్రటరీ ఏఆర్ రెడ్డితో కలిసి అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ యూనియన్లతో చర్చల్లో రవాణా మంత్రి పువ్వాడ అజయ్ లేకపోవడాన్ని గమనించాలన్నారు. ప్రభుత్వానికి ఎన్నికలు వచ్చినప్పుడే సమస్యలు గుర్తుకొస్తాయన్నారు. ఆర్టీసీలో యూనియన్లే లేనప్పుడు కొందరు యూనియన్ నేతలతో మంత్రి హరీశ్ రావు చర్చలు ఎలా జరుపుతారని ఆయన ప్రశ్నించారు. కార్మికుల పైసలు కార్మికులకు ఇవ్వడానికి చర్చలు ఎందుకన్నారు.

ఆర్టీసీలో జీతాలు పెంచుతామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని, కానీ ఇంతవరకూ పెంచలేదన్నారు. బడ్జెట్ లో రూ. 1,500 కోట్లు కేటాయించినా నిధులు విడుదల చేయలేదన్నారు. ఆర్టీసీ కార్మికులు తీవ్ర నిరాశలో ఉన్నారని టీఎంయూ జనరల్ సెక్రటరీ ఏఆర్ రెడ్డి అన్నారు. కార్మికులకు 2013 పీఆర్సీ బకాయిలు, 2 కొత్త పీఆర్సీలు రావాల్సి ఉందన్నారు. కార్మికులకు 3 డీఏలు ఇస్తున్నట్లు చైర్మన్ ప్రకటించి 2 డీఏలు మాత్రమే ఇచ్చారన్నారు. ఎన్నికల కోసం డీఏలు ప్రకటించడం లేదని చైర్మన్ చెప్పారని, కానీ ఇది అబద్ధమని టీఎంయూ అధ్యక్షుడు తిరుపతి అన్నారు.  ఎన్నికలు ఉన్నందుకే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని అంటున్నారని తెలిపారు.