9 ఏండ్లు ఆర్టీసీని ఆగం చేసిన్రు : అశ్వత్థామ రెడ్డి

9 ఏండ్లు ఆర్టీసీని ఆగం చేసిన్రు : అశ్వత్థామ రెడ్డి
  • 9 ఏండ్లు ఆర్టీసీని ఆగం చేసిన్రు
  • సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : అశ్వత్థామ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : బీఆర్ ఎస్ 9 ఏళ్ల పాలనలో ఆర్టీసీని ఆగం చేసిండ్రని, కార్మికులు ఎంతో గోస పడ్డరని ఆర్టీసీ టీఎంయూ ఫౌండర్ జనరల్ సెక్రటరీ అశ్వత్థామ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సర్కారు రావటంతోనే కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఆదివారం విద్యా నగర్ లోని యూనియన్ ఆఫీస్ లో టీఎంయూ రాష్ర్ట కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో యూనియన్ విస్తరణ, బలోపేతం, ఆర్టీసీ విలీన సమస్యలు, యూనియన్ల రీ ఎంట్రీ పై చర్చ జరిపారు. సమావేశంలో అశ్వత్థామరెడ్డి మాట్లాడారు. 

ఆర్టీసీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, త్వరలో సీఎం రేవంత్ ను కలుస్తామని తెలిపారు.  కాంగ్రెస్ గెలుపులో కార్మికుల పాత్ర ఎంతో ఉందని వెల్లడించారు. ఆర్టీసీకి కాంగ్రెస్ సీఎంలు వైఎస్, కిరణ్ కుమార్ లు ఎంతో చేశారన్నారు. మహిళలకు ఫ్రీ జర్నీ మహాలక్ష్మి స్కీమ్ అభినందనీయమని పేర్కొన్నారు. ఆర్టీసీలో యూనియన్లను తీసుకొచ్చి, ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వంతో మాట్లాడుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆర్టీసీ సమస్యలు ప్రస్తావించారని, అవి అమలు చేస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు. ఉద్యమ నాయకుడు పొన్నం ప్రభాకర్ కు ట్రాన్స్ పోర్ట్ శాఖ ఇవ్వటం మంచి పరిణామం అని, ఆర్టీసీ గురించి అన్ని అంశాలు మంత్రికి తెలుసని అశ్వత్థామరెడ్డి తెలిపారు. 

మంత్రికి శుభాకాంక్షలు చెప్పిన నేతలు

యూనియన్ మీటింగ్ తరువాత టీఎంయూ నేతలు ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ను సోమాజిగూడలోని ఆయన నివాసంలో కలిశారు. అరగంట పాటు మంత్రి తో  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమస్యలను ప్రస్తావించారు. త్వరలో బస్ భవన్ కు వస్తానని, అన్ని సమస్యలపై తనకు అవగాహన ఉందని,  ఆర్టీసీ బలోపేతంపై సీఎం దృష్టి సారించారని నేతలతో మంత్రి అన్నారు.