
అబుదాబి: ఆసియా కప్ సూపర్-4 రౌండ్‌ను ఓటమితో ప్రారంభించి డీలా పడ్డ శ్రీలంక, పాకిస్తాన్ మెగా టోర్నీలో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. మంగళవారం జరిగే కీలక మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. టోర్నమెంట్‌లో తమ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇరు జట్లకు తప్పనిసరి. గెలిచిన జట్టు ఫైనల్ రేసులో నిలవనుండగా.. ఓడిన టీమ్ ఇంటిదారి పట్టనుంది.
గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక సూపర్-4 తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో 4వికెట్ల తేడాతో అనూహ్యంగా ఓడింది. ఈ పరాజయంతో టీ20 ఆసియా కప్‌లో లంక 8 మ్యాచ్‌ల విజయ పరంపరకు తెరపడింది. మరోవైపు, మైదానం బయటి వివాదాలు, చెత్త ఆటతో పాకిస్తాన్ జట్టు గందరగోళంలో పడింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి ఇండియా చేతిలో చిత్తుగా ఓడటం ఆ జట్టును మరింత కుంగదీసింది. ఈ టోర్నీలో టీమిండియా చేతిలో పాక్‌కు ఇది రెండో ఓటమి. తమ ఆరంభ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఇండియా, బంగ్లా రెండేసి పాయింట్లతో పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. లంక, పాక్ ఖాతా తెరవకుండా చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. కెప్టెన్ సల్మాన్ ఆగా నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఈ మ్యాచ్ ఆడనుంది.
మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, సీనియర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ లేకపోవడంతో ఆ జట్టు బ్యాటింగ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో సాహిబ్జదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్ మంచి ఆరంభాన్నిచ్చినా, మిడిలార్డర్ వైఫల్యంతో భారీ స్కోరు చేయలేకపోయింది. బౌలింగ్‌లోనూ ఇండియా బ్యాటర్ల ధాటికి పాక్ తేలిపోయింది. మరోవైపు, శ్రీలంక జట్టులోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌పై దసున్ షనక రాణించినా, మిడిలార్డర్ వైఫల్యం ఆ జట్టును వేధిస్తోంది.
గ్రూప్ దశలో వరుస ఫిఫ్టీలతో అదరగొట్టిన పాతుమ్ నిశాంక టచ్ కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, కుశాల్ మెండిస్ మంచి ఫామ్‌లో ఉండటం వారికి సానుకూలాంశం. బౌలింగ్‌లో నువాన్ తుషార అద్భుతంగా రాణిస్తున్నాడు. తండ్రి మరణించడంతో గత మ్యాచ్‌కు దూరమైన స్పిన్ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలాగే తిరిగి జట్టులో చేరడం లంకకు అదనపు బలం కానుంది.