Asia Cup 2025 final: ఆసియా కప్ గెలిస్తే ప్రైజ్ మనీ ఎంత..? గత ఎడిషన్‌‌తో పోలిస్తే విన్నర్, రన్నరప్‌లకు రెండు రెట్లు

Asia Cup 2025 final: ఆసియా కప్ గెలిస్తే ప్రైజ్ మనీ ఎంత..? గత ఎడిషన్‌‌తో పోలిస్తే విన్నర్, రన్నరప్‌లకు రెండు రెట్లు

దుబాయ్ ఇంటర్నేషల్ గ్రౌండ్ లో మరికాసేపట్లో ఆసియా కప్ ఫైనల్ ప్రారంభం కానుంది. ఆదివారం (సెప్టెంబర్ 28) ఇండియా- పాకిస్థాన్ జట్ల మధ్య ఈ తుది సమరం జరగనుంది. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం అయిన ఈ కాంటినెంటల్ టోర్నీ 20 రోజుల పాటు ఫ్యాన్స్ ను అలరించి నేటితో ముగియనుంది. 41  ఏళ్ళ టోర్నీ చరిత్రలో ఇండియా- పాకిస్థాన్ తొలిసారి ఫైనల్ ఆడుండడంతో మ్యాచ్ క్రేజ్ ఆకాశాన్ని దాటేసింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. రాత్రి 7:30 నిమిషాలకు టాస్ వేస్తారు. సోనీ స్పోర్ట్ నెట్ వర్క్ లో లైవ్ టెలికాస్టింగ్.. సోనీ లైవ్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. మ్యాచ్ ను ఫ్రీ గా చూడాలంటే డిడి టీవీలో చుడొచ్చు. 

ఆసియా కప్ విన్నర్ కు 2.6 కోట్లు: 
  
ఆసియా కప్ లో విజేతకు నిలిచిన జట్టుకు రూ. 2.6 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. 2023 ఆసియా కప్ ప్రైజ్ మనీ కంటే రెండు రెట్లు  ఎక్కువ. 2023 లో ఆసియా కప్ లో విజేతగా నిలిచిన భారత జట్టుకు రూ. 1.5 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ దక్కింది. ఇక రన్నరప్ గా నిలిచిన జట్టుకు విజేతలో సగం అంటే 1.3 కోట్ల రూపాయలు లభించనున్నాయి. 2023లో రన్నరప్ శ్రీలంక రూ. 82 లక్షలు గెలుచుకుంది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకుంటే 12.5 లక్షలు లభిస్తాయి. ఓవరాల్ గా గత ఎడిషన్ తో పోల్చుకుంటే ఆసియా కప్ ప్రైజ్ మనీ రెండు రెట్లు పెరిగింది. 

టీమిండియాకు తిరుగుందా..? 

ఈ టోర్నీలో టీమిండియా ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. ఆడిన ఆరు మ్యాచ్‌‌లలోనూ గెలిచి జైత్రయాత్ర కొనసాగించింది. శ్రీలంకతో గత పోరులో బుమ్రా, దూబే లేకుండా ఆడినా సూపర్ ఓవర్లో గెలిచి ఫైనల్‌‌కు ముందు మరింత జోష్ పెంచుకుంది. జట్టు విజయాల్లో యంగ్‌‌ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఆరు మ్యాచ్‌‌ల్లో 309 రన్స్‌‌తో టోర్నీ టాప్ స్కోరర్‌‌‌‌గా ఉన్న అతను 200 ప్లస్ స్ట్రయిక్ రేట్‌‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. అభిషేక్ తర్వాత తిలక్ వర్మ (144 రన్స్‌‌) టాప్ స్కోరర్‌‌గా ఉన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌‌మన్ గిల్ వంటి కీలక ఆటగాళ్లు ఇంకా స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్  చేయలేదు.

ఒకవేళ ఫైనల్‌‌లో అభిషేక్ ఫెయిలైతే మిడిలార్డర్ బాధ్యత తీసుకోవాల్సి ఉంది. గత మ్యాచ్‌‌లో తిలక్‌‌, శాంసన్ ఆ పని చేసినప్పటికీ.. సూర్యకుమార్ ఆఖరాటలో అయినా తన మార్కు చూపెట్టాల్సిందే. కెప్టెన్‌‌గా సూర్య అద్భుతంగా రాణిస్తున్నా, బ్యాటర్‌‌గా మాత్రం తేలిపోతున్నాడు. ఈ ఏడాది 10 ఇన్నింగ్స్‌‌ల్లో  కేవలం 110 స్ట్రయిక్ రేట్‌‌తో 99 రన్స్‌‌ మాత్రమే చేశాడు. అతని డాట్ బాల్ శాతం 35 నుంచి 48 శాతానికి పెరిగింది. ప్రత్యర్థి బౌలర్లు అతనికి ఔట్ సైడ్  ఆఫ్‌‌ స్టంప్ వైడ్ యార్కర్లు వేస్తూ కట్టడి చేస్తున్నారు.