ముంబై: ఆసియా కప్ ట్రోఫీ ఒకటి, రెండు రోజుల్లో ఇండియాకు అప్పగించే చాన్స్ ఉందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. ఒకవేళ కప్ విషయంలో ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే ఈ నెల 4న జరిగే ఐసీసీ సమావేశంలో దీనిపై పెద్ద ఎత్తున నిరసన తెలుపుతామని వెల్లడించింది. ‘టోర్నీ ముగిసి నెల రోజులు కావొస్తుంది. అయినా మాకు ట్రోఫీ అందలేదు. దీనిపై చాలా అసంతృప్తితో ఉన్నాం.
ఈ విషయంపై మేం 10 రోజుల కిందటే ఏసీసీ చైర్మన్‌కు లేఖ రాశాం. కానీ నఖ్వీ వైఖరిలో ఎలాంటి మార్పులేదు. అతను ఇప్పటికీ ట్రోఫీని ఆధీనంలో ఉంచుకున్నాడు. అయినప్పటికీ ఒకట్రెండు రోజుల్లో ట్రోఫీ బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌కు చేరుకుంటుందని ఆశిస్తున్నాం. లేకపోతే ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం’ అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు.
ట్రోఫీని తీసుకొచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, ఇందులో దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ‘మేం పాక్‌తో జరిగిన అన్ని మ్యాచ్‌లు గెలిచాం. ట్రోఫీని కూడా సొంతం చేసుకున్నాం. చాంపియన్లుగా నిలిచాం. ప్రతిదీ రికార్డులో ఉంది. ట్రోఫీ మాత్రమే లేదు. ఈ విషయంలో మంచి తెలివితేటలే గెలుస్తాయని మేం ఆశిస్తున్నాం’ అని సైకియా పేర్కొన్నారు.
మరోవైపు సౌతాఫ్రికాతో గువాహటిలో జరిగే టెస్ట్ మ్యాచ్‌లో సెషన్స్‌ను కొద్దిగా మార్చే చాన్స్ ఉందని సైకియా అన్నాడు. లంచ్ బ్రేక్‌కు ముందు టీ విరామం రావొచ్చని తెలిపారు. ‘దేశంలోని తూర్పు ప్రాంతంలో సూర్యోదయం, సూర్యాస్తమయం ముందుగా ఉంటాయి.
దీన్ని బట్టి ఆరు గంటల ఆటను సర్దుబాట్ చేయాలంటే సెషన్స్‌లో స్వల్ప మార్పులు జరగొచ్చు. సాధారణంగా 12 గంటలకు వచ్చే లంచ్ బ్రేక్ 2 గంటలకు వెళ్లే చాన్స్ ఉంది. అంతకుముందే టీ బ్రేక్ ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. దీనివల్ల ఆటకు సరైన సమయం లభిస్తుంది. ఈ ప్రక్రియపై చర్చలు జరుగుతున్నాయి’ అని సైకియా పేర్కొన్నారు.
